ఏపీలో ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రచారంలో దూసుకెళ్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు పామర్రులో ప్రజాగళం సభ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రోడ్ల మీద గుంతలు పూడ్చలేని జగన్.. మూడు రాజధానులు కడతారని ఏవోవో చెప్పి ఏం చేయలేదని అన్నారు. అమరావతి పూర్తయి ఉంటే ప్రభుత్వానికి సమృద్ధిగా ఆదాయం ఉండేదన్నారు.
వైసీపీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. దాంతో.. ఉద్యోగాలు లేక యువత ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సిన పరిస్థితులు వచ్చాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ పాలనలో ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరని అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించారా? డీఎస్సీ వేశారా? అని నిలదీశారు.
ఏటా 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనది అన్నారు. వర్క్ ఫ్రమ్ హోం కూడా తీసుకొస్తామని అన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని.. బాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చంద్రబాబు అన్నారు. అలాగే.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన చిరకాల కోరిక అన్నారు. సీఎం జగన్ తన కేబినెట్‌లోకి బూతులు మాట్లాడే వారినే తీసుకున్నారనీ చంద్రబాబు అన్నారు.