దేశంలోని పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ దెబ్బకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే కాళ్లలో చక్రాలు ఉన్నట్టు ప్రవర్తించే కొందరు మాత్రం నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు చిక్కుతున్నారు. పోలీసులకు చిక్కాక వారు చెప్పే కారణాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. గతంలో టాటా సాల్ట్ ఉప్పు ప్యాకెట్, గోధుమ పిండి అంటూ పలువురు వింత కారణాలు చెప్పడం మనకు తెలిసిందే.
తాజాగా కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి చెప్పిన కారణం విని ఏకంగా పోలీసులే షాకయ్యారు. లాక్ డౌన్లో బయటకు ఎందుకు వచ్చారు అని పోలీసులు అడిగితే.. తన కోడికి మలబద్ధకం వచ్చిందని, చికిత్స కోసం పశువైద్యుడి వద్దకు తీసుకెళుతున్నానని అతడు చెప్పుకొచ్చాడు. ఈ ఘటన తాలూకు వివరాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు ఈ సమాధానం విని కడుపుబ్బా నవ్వుకుంటుంటే కొందరు మాత్రం.. అందులో వాస్తవం ఉండి ఉండొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా పెంపుడు జంతువులు ఉన్న వాళ్లు సదరు వ్యక్తి నిజమే చెప్పి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేస్తున్నారు.