నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐసీసీ సారథి సోనియాగాంధీ బుధవారం నాడు జరిగే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ విచారణకు హాజరయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. జూన్ 2వ తేదీన ఆమె కరోనాబారిన పడినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె కోవిడ్ నివారణకు చికిత్స పొందుతున్నారు. 75 సంవత్సరాల వయసులో ఆమె ఇతర అనారోగ్య సమస్యలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఈడీ విచారణకు హాజరవడం అనుమానమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చికిత్స చేస్తున్న వైద్యులు అనుమతిస్తే మరో రోజు విచారణకు హాజరవుతారని పేర్కొన్నాయి. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన అక్రమ లావాదేవీల ఆరోపణలపై విచారణకు హాజరవ్వాల్సిందిగా సోనియాగాంధీ, ఆమె తనయుడు, ఎంపీ రాహుల్‌గాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
మోసం, కుట్ర, పత్రికను స్వాధీనం చేసుకునేందుకు నేరపూరితంగా వ్యవహరించడం, నమ్మించి ద్రోహం చేయడంవంటి ఆరోపణలతో వారిపై కేసు నమోదైంది. కాగా నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని, రాజకీయ కక్షతో కేంద్ర ప్రభుతం దర్యాప్తు సంస్థలను దురినియోగం చేస్తోందని కాంగ్రెస్ మండిపడుతోంది. కాగా విదేశీ పర్యటన నేపథ్యంలో విచారణ తేదీని మార్చాలని గతంలో రాహుల్ గాంధీ కోరిన విషయం తెలిసిందే. కాగా ఈనెల 13న ఆయనను ఈడీ విచారించనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.