ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి సంచలనాకు కేంద్రబిందువైన ఎలాన్ మస్క్‌ను ఇప్పుడు కోర్టు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ట్విటర్ నుంచి 7500 మంది తొలగించబడ్డారు. వీరిలో చాలా మంది కోర్టును ఆశ్రయించే పనిలోపడ్డారు. మస్క్ వైఖరిని, ట్విటర్ కంపెనీ నిర్ణయాలను సవాల్‌చేస్తూ వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. ప్రపంచ కుబేరుడైన మస్క్ చట్టవిరుద్ధంగా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతో ఉన్నారని ప్రముఖ న్యాయవాది శానస్ లిస్ రియోర్టన్ ఆరోపించారు. ట్విటర్‌నుంచి ఉద్వాసనకు గురైన కొందరు ఉద్యోగుల తరఫున రియోర్టన్ శాన్ఫ్రాన్సిస్కో కోర్టులో దావా వేశారు. గతంలో సంస్థ తమకు ఇచ్చిన హామీ మేరకు పరిహారం అందడం లేదని, మస్క్ తమ హక్కులను కాలరాశాడని వీరు కోర్టుకెక్కారు. సంస్థ పునరుద్ధరణలో భాగంగా కష్టపడి పనిచేయాలని లేదంటే కంపెనీ నుంచి నిష్క్రమించాలని ఉద్యోగులకు ఎలాన్ మస్క్ జారీచేసిన అల్టిమేటంపై వీరు న్యాయ కోణాలను అన్వేషిస్తున్నారు
. ఉద్యోగులను తొలగించిన విధానం కాలిఫోర్నియా చట్టాలకు విరుద్ధంగా ఉందని న్యాయవాదులు తెలిపారు. పరిహారం నిరాకరించడం, కనీసం 60 రోజుల ముందు ఉద్వాసన సమాచారం ఇవ్వడం వంటి నిబంధనల్ని ఆయన ఉల్లంఘించారని బాధిత ఉద్యోగులు ఆరోపించారు. దీనికితోడు ఇటీవల ఉద్యోగులు సంస్థకోసం అదనపు సమయం కేటాయిస్తున్నారని, వారికోసం శాన్ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలోనే పడక గదులు ఏర్పాటు చేశారనే ఆరోపణలపైనా కొందరు కోర్టును ఆశ్రయిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఉన్నఫలంగా తొలగించడంపైనా మరికొందరు ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అసంతృప్తితో ఉన్నారు.