Thursday, November 14, 2024

TG | రెండు దశల్లో మూసీ ప్రక్షాళన.. బాపూఘాట్‌లో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం !

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మొట్టమొదట మూసీ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. మూసీ నదికి గోదావరి జలాలను తీసుకుచ్చి లక్ష్యాన్ని చేరుకునే దిశగా కసరత్తు పూర్తయింది. తొలి దశలో గండిపేట నుంచి బాపూఘాట్‌ వరకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి లంగర్‌ హౌస్‌లోని బాపూఘాట్‌ వద్ద అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి పునాది రాయి వేయడం ద్వారా చర్యలు పుంజుకోనున్నాయి.

బాపూఘాట్‌ ప్రాంగణంలో ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో వచ్చే 15 రోజుల్లో టెండర్లను పిలవడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ విగ్రహం ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అంతేకాక, ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా, సుందరీకరణ పనులు చేపట్టడం ద్వారా హైదరాబాద్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బాపూఘాట్‌ దగ్గర ఎస్టీపీలతో నీటిని శుద్ధి చేయడానికి ఏర్పాట్లు చేయనున్నారు. ఎస్టీపీలకు రూ.7వేల కోట్లతో టెండర్లు పిలవడానికి రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు ప్రారంభమవడం ద్వారా మూసీ నది పునరుద్ధరణకు కొత్త వెలుగులు తేవడమే కాకుండా, నగరంలోని ప్రజలకు పరిశుభ్ర నీటి వనరులు అందించడం కూడా సాధ్యమవుతుందని రేవంత్‌ రెడ్డి సర్కార్‌ భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement