Saturday, November 23, 2024

Followup: అట్టహాసంగా ముర్ము నామినేషన్‌.. మోడీ, షా, రాజ్‌నాథ్‌, నడ్డా సమక్షంలో దాఖలు

రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ గవర్నర్‌, బీజేపీ నాయకురాలు ద్రౌపది ముర్ము శుక్రవారంనాడు అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, ప్రహ్లాద్‌ జోషి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా వంటి ప్రముఖులు, ఎన్డీయే పక్షాల నేతలు, మద్దతు ఇస్తున్న ఇతర పార్టీల నేతల సమక్షంలో ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. ఆమె సంతకం చేసిన తరువాత నామినేషన్‌ పత్రాలను స్వయంగా ప్రధాని మోడీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పి.సి.మోడీకి అందజేశారు. తెల్లని చీర కట్టుకున్న ద్రౌపది మధ్యాహ్నం 12 గంటల తరువాత పార్లమెంట్‌ హౌస్‌కు చేరుకోగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి సాదర స్వాగతం పలికారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎన్డీయే పక్షాల నేతలతో కలసి పార్లమెంట్‌ ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన బిర్సా ముండా విగ్రహాల వద్దకు చేరుకుని నివాళి అర్పించారు. అనంతరం నామినేషన్‌ దాఖలు చేసేందుకు పార్లమెంట్‌లోని ఎన్నికల కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో అక్కడకి చేరుకున్న ప్రధాని ద్రౌపది ముర్ముకు అభినంనదలు తెలిపారు. వివిధ రాజకీయ పక్షాల నేతలను పేరుపేరునా పలకరిస్తూ ముందుకు కదిలారు. ఆ తరువాత నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ముగిసింది. ఈ ఎన్నికలో తమ అభ్యర్థి గెలుపు తథ్యమని చాటేలా బలప్రదర్శన చేసినట్లుగా ఎన్డీయే పక్షాలు వ్యవహరించాయి. ఈ ప్రదర్శనకు ప్రధాని దగ్గరుండి మద్దతు ఇవ్వడం విశేషం. నామినేషన్‌ దాఖలు చేసినప్పుడు ఆమె కేంద్రమంత్రులతో పాటు ఎన్డీయే పక్షాల నేతలు, బీజేపీ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్‌, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, పుష్కర్‌ సింగ్‌ ధామి, జైరామ్‌ ఠాకూర్‌, వైఎస్సార్‌సీపీ, బీజేడీ, అన్నాడీఎంకేకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. ఆ మూడు ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు కాకపోయినప్పటికీ వివిధ కారణాలవల్ల ముర్ముకు మద్దతు ప్రకటించాయి. ఒడిశా ఆడపడుచుకు మద్దతు ఇస్తున్నట్లు రెండు రోజుల క్రితం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ బేషరతుగా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నవీన్‌ ఇటలీ పర్యటనలో ఉన్నప్పటికీ పార్టీకి చెందిన శాసనసభ్యులకు మర్ముకు ఓటు వేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం లభిస్తున్న వివిధ పార్టీల మద్దతు రీత్యా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక దాదాపు లాంఛనమే. కాగా గురువారం నాడు ఆమె ప్రధాని మోడీ సహా పార్టీ ప్రముఖులు, కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేస్తూ ఈ ఎన్నికలో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా అన్ని పార్టీలకు చెందిన ఓటర్లను కోరబోతున్నట్లు పేర్కొన్నారు. ఒడిశాకు చెందిన 64 ఏళ్ల ద్రౌపది ముర్ము శంథల్‌ వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో ఆమె ఒడిశా మంత్రిగాను, ఝార్ఖండ్‌ గవర్నర్‌గాను వ్యవహరించారు. కాగా విపక్షాల అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా ఆమెతో తలపడతున్న విషయం తెలిసిందే. ఈనెల 29వరకు నామినేషన్లకు గడువుండగా జులై 18న ఓటింగ్‌ నిర్వహించి 21వ తేదీన ఓట్ల లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

సోనియాసహా విపక్ష నేతలకు ద్రౌపది ఫోన్‌..

రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం కాంగ్రెస్‌ సహా పలు విపక్ష పార్టీల నేతలకు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము స్వయంగా ఫోన్‌ చేశారు. నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళ్లే ముందు ఏఐసీసీ సారథి సోనియాగాంధీ, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ సారథి శరద్‌ పవార్‌లకు ఫోన్‌ చేసి మద్దతు ఇవ్వాలని కోరారు. కాగా ఆమెకు ఆయా నేతలు శుభాకాంక్షలు చెప్పారు.

యశ్వంత్‌ సిన్హాకు జడ్‌ కేటగిరీ భద్రత..

రాష్ట్రపతి పదవికి విపక్షాల అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హాకు జడ్‌ కేటగిరీ భద్రత కల్పిస్తూ శుక్రవారం కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన సాయుధ కమాండోలతో ఆయనకు భద్రత కల్పిస్తారు. దాదాపు 8-10 మంది కమాండోలు షిఫ్టుల వారీగా పనిచేస్తూ సిన్హాను కంటికి రెప్పలా కాపాడుతూంటారు. ఆయన దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట ఉంటారు. కాగా ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మకు జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించిన విషయం తెలిసిందే. కాగా ఈనెల 27న సిన్హా నామినేషన్‌ వేసే అవకాశం ఉంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement