Friday, November 22, 2024

మునుగోడు మాదే.. రాజగోపాల్ రెడ్డికి వ్యాపారమే ముఖ్యం, ప్రజలు కాదు : ఎంపీ లింగయ్య

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారని వస్తున్న వార్తల నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక జరిగితే గెలిచేది తామేనని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బడుగులు లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన లింగయ్య యాదవ్, మునుగోడు నియోజకవర్గంలో తమకు కావాల్సినంత మెజారిటీ ఉందన్నారు. అయితే ఉప ఎన్నిక కోరుకోవాల్సిన అవసరం మాత్రం తమకు లేదని తెలిపారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే రాజగోపాల్ రెడ్డిని ఇంటికి పంపేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాలో మునుగోడు ఒక్క స్థానంలోనే టిఆర్ఎస్ లేదని, ఇప్పుడు అక్కడ కూడా పాగా వేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు టీఆర్ఎస్‌వైపే ఉన్నారని బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మునుగోడు ప్రజలను రాజగోపాల్ రెడ్డి అయోమాయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను విమర్శించడం మానుకోవాలని, మునుగోడులో ఆయన ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా హాజరుకావడం లేదని అన్నారు.

గెలిచాక నియోజకవర్గంలో కనపడకుండా పోయారని ఆరోపించారు. జిల్లా మంత్రి జాగదీశ్వర్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలల్లో పాల్గొంటూ కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు స్వయంగా పంచుతుంటే, రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటూ ప్రజలకు ఆందుబాటులో లేకుండాపోయారని దుయ్యబట్టారు. మునుగోడు అభివృద్ధి జరిగిందంటే అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగానేనని, దీనిపై చర్చకు కూడా తాము సిద్ధమని అన్నారు. మునుగోడు ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం కల్పిస్తూ మిషన్ భగీరథ ద్వారా కృష్ణా నీటిని మళ్లిస్తున్నామని అన్నారు. మొత్తం నల్గొండ జిల్లానే ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చేశామని లింగయ్య యాదవ్ వ్యాఖ్యానించారు. కుటుంబమంతా రాజకీయాల్లో ఉంటూ వ్యాపారాల కోసం రాజకీయ పార్టీలతో బేరసారాలు చేసే రాజగోపాల్ రెడ్డి కుటుంబ పాలన అంటూ కేసీఆర్‌ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement