Saturday, November 23, 2024

మునిసిపాలిటీలకు సొంత వనరుల కల.. త్వరలో ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు జోరుగా జరగడంతో పురపాలికలు సొంత వనరులతో కళకళలాడుతున్నాయి. ఎర్లీబర్డ్‌ పేరుతో పురపాలికలుఇచ్చిన ఆస్తిపన్ను డిస్కౌంట్‌ ఆఫర్‌ను ఎక్కువ మంది ఆస్తుల యజమానులు వినియోగించుకుని ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించడంతో ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పట్టణస్థానిక సంస్థలకు నిధుల కొరతలేకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగి నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ఎర్లీబర్డ్‌ పేరుతో ఆస్తి పన్ను వసూళ్లు మునిసిపాలిటీలకు ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఊరటనిచ్చాయని వారు పేర్కొంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగిలిన మునిసిపాలిటీలన్నింటిలో కలిపి ఎర్లీబర్డ్‌ కింద రూ.300 కోట్ల దాకా వసూలైన విషయం తెలిసిందే. వీటికి తోడు త్వరలో జరగనున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక నిధులు కలిసి పురపాలికల్లో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా జరగనున్నాయని అధికారులు చెబుతున్నారు. గత రెండేళ్లలో కొవిడ్‌ సంక్షోభం ఉన్పప్పటికీ మునిసిపాలిటీల ఆదాయం ఏ మాత్రం తగ్గలేదు. ఇదే క్రమంలో పన్ను వసూళ్లలో వృద్ధి నమోదవుతోంది. పురపాలక శాఖ గతంలో విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ఆర్ధిక ఏడాది 2021-22లో పట్టణ ప్రగతి కింద రూ.2062 కోట్లు విడుదలయ్యాయి. వరంగల్‌, ఖమ్మం, నగరాల్లో రోజువారి మంచినీటి సరఫరా ప్రారంభమైంది. నిజామాబాద్‌, సిద్ధిపేటలో రూ.543 కోట్లతో భూ గర్భ మురుగునీటి పథకాలు పూర్తయ్యాయి. అక్కడ రూ.26 కోట్లతో వీడీసీసీ రోడ్డు సహా నెక్లెస్‌ రోడ్డు పనులు పూర్తయ్యాయని తెలిపారు. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పైనున్న 19 ఇంటర్‌ ఛేంజ్‌ల వద్ద ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులు పూర్తిచేసినట్లు తెలిపారు. భాగ్యనగరంలోని నాలాల సమగ్ర అభివృద్ధి కోసం వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలవుతున్నాయి.

మునిసిపాలిటీల్లో పెరిగిన నర్సరీలు…

ఇప్పటివరకు జరిగిన పట్టణ ప్రగతి, హరిత హారం కార్యక్రమాల్లో భాగంగా పట్టణ ప్రాంతాల్లో నర్సరీల సంఖ్య 168 నుంచి 1002కు పెరిగాయని, జీహెచ్‌ఎంసీలో 600 నర్సరీలు, 1041 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ మినహా 141 పట్టణాల్లో 4,118 పబ్లిక్‌ టాయిలెట్‌లు పూర్తి చేయడంతో పాటు 1898 శానిటేషన్‌ వాహనాలు సమీకరించుకున్నారు. ఏడు పట్టణాల్లో మానవ వ్యర్థాలు శుద్ధి చేసేందుకు ఎఫ్‌.ఎస్‌.టి.పిలు ప్రారంభించడంతో పాటు 15 పట్టణాల్లో జంతు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement