ఖమ్మం నగరంలో శిథిలావస్థకు చేరిన అన్ని భవనాలకు నోటీసులు జారీ చేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మున్సిపల్ నగర పాలకసంస్థ అధికారులను ఆదేశించారు. ముందస్తు చర్యలతో ఏటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలలో శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి ఆ భవనాల్లో ఉంటున్న ప్రజల ప్రాణనష్టాన్ని నివారించేందుకు అటువంటి భవనాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని దిశానిర్దేశం చేశారు.
అదేవిధంగా నగరంలో ఉన్న భారీ, ప్రమాదకర వృక్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. నగరపాలకంలో చిన్న సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎదురయ్యే పరిణామాల తీవ్రంగా ఉండే అవకాశమున్నందున మోడువారి శిధిలమై నెలకొరిగేందుకు సిద్దంగా ఉన్న వృక్షాల పట్ల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఇటీవల ఖమ్మం బ్రాహ్మణ బజారులో వృక్షం, గోడ కూలి ఇద్దరు పిల్లలు మరణించడం బాధాకరమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటువంటి దురదృష్ట ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..