ప్రతిష్టాత్మక ఇరానీ కప్ 2024లో ముంబై రంజీ టీమ్ విజేతగా నిలిచింది. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇరానీ కప్‌ను ముద్దాడింది. లక్నో వేదికగా రెస్టాఫ్ ఇండియా, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా ముగిసింది. దీంతో టోర్నీ రూల్స్ ప్రకారం…. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ముంబై జట్టును అంపైర్లు విజేతగా ప్రకటించారు. ఇక అద్భుతమైన డబుల్ సెంచరీతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన సర్ఫరాజ్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఓవర్‌నైట్ స్కోర్ 153/6తో చివరి రోజు ఆటను కొనసాగించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌ను 329/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తనుష్ కోటియన్ (150 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 114 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. మోహిత్ అవస్థి (93 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. పృథ్వీ షా(105 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 76) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(6/121) ఆరు వికెట్లు తీయగా.. మనవ్ సుతార్(2/78) రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక చివరి సెషన్‌లో ఫలితం తేలే ఆస్కారం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రా అంగీకరించారు. దాంతో రెస్టాఫ్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ ఆడలేదు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 141 ఓవర్లలో 537 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్(286 బంతుల్లో 25 ఫోర్లు, 4 సిక్స్‌లతో 222 నాటౌట్) అజేయ ద్విశతకంతో రాణించగా.. తనూష్ కోటియన్(124 బంతుల్లో 6 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముఖేష్ కుమార్(5/110) ఐదు వికెట్లతో చెలరేగగా.. యశ్ దయాల్(2/89), ప్రసిధ్ కృష్ణ(2/102) రెండేసి వికెట్లు పడగొట్టారు. సరాన్ష్ జైస్(1/82)కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(292 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 191) తృటిలో ద్విశతకం చేజార్చుకోగా.. యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(121 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 93) సెంచరీ అందుకోలేకపోయాడు. ముంబై బౌలర్లలో షామ్స్ ములానీ, తనూష్ కోటియన్ మూడేసి వికెట్లు తీయగా.. మోహిత్ అవస్థి రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ జునేద్ ఖాన్ ఓ వికెట్ తీసాడు. దాంతో ముంబైకి 121 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.