మహారాష్ట్రలోని జోగేశ్వరి పోలీస్ స్టేషన్‌లో ఓ క్రిమినల్ పుట్టినరోజు వేడుకలను పోలీస్ నిర్వహించడం పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారింది. కరుడుగట్టిన క్రిమినల్ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడమే కాకుండా అతడికి స్వయానా పోలీస్ ఇన్‌స్పెక్టర్ కేక్ తినిపించడం విమర్శలకు దారి తీసింది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని సబర్బన్ ప్రాంతమైన జోగేశ్వరి పోలీస్ స్టేషన్‌లో మహేంద్ర నెలీకర్ సీనియర్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. అదే స్టేషన్‌లో డానిష్ షేక్ అనే కరడు గట్టిన క్రిమినల్‌పై కేసులు నమోదయ్యాయి. అయితే రెండు వారాల క్రితం ఓ హౌసింగ్ సొసైటీ ఆఫీస్‌లో డానిష్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. దానికి హాజరైన ఇన్‌స్పెక్టర్ మహేంద్ర స్వయంగా ఆ క్రిమినల్‌కు కేకు తినిపించాడు. ఆ సందర్భంగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని ఇన్‌స్పెక్టర్ మహేంద్ర వివరణ ఇచ్చారు. ‘హౌసింగ్ సొసైటీలో ఇళ్ల కూల్చివేత పనులు జరుగుతుండగా అక్కడికి వెళ్లాను. ఈ సందర్భంగా కొందరు సీనియర్ సిటిజన్లు తనను సొసైటీ ఆఫీస్‌కు పలిచారు. దీంతో తాను అక్కడికి పోయాను. అయితే అక్కడికి డానిష్ కూడా వస్తాడని తనకు తెలియదు. అయినా అది చాలా రోజుల క్రితం వీడియో’ అని వెల్లడించారు.
ఈ వార్త కూడా చదవండి: బాలికను రక్షించడానికి వెళ్లి బావిలో పడ్డ 40 మంది