Thursday, November 21, 2024

WPL తొలి సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఘనవిజయం

ఉత్కంఠ భరిత పోరులో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 చాంపియన్ గా నిలిచింది. బ్రబోర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీని అందుకుంది. దాంతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ లో చాంపియన్ గా నిలిచింది. 132 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసి నెగ్గింది. తద్వారా మరో 3 బంతులు మిగిలి ఉండగానే చాంపియన్ గా నిలిచింది. సెమీస్ లో అర్ధ సెంచరీతో అదరగొట్టిన నాట్ సీవర్ (55 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు) మరోసారి మ్యాచ్ విన్నర్ గా నిలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (39 బంతుల్లో 37; 5 ఫోర్లు) రాణించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఢిల్లీ తరఫున కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (29 బంతుల్లో 35; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచింది. ఆమె తప్ప మిగిలిన ప్లేయర్లు దారుణంగా విఫలం అయ్యారు. అజేయమైన ఆఖరి వికెట్ కు శిఖా పాండే (17 బంతుల్లో27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), రాధా యాదవ్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) 52 పరుగులు జోడించారు. ముంబై బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్, వోంగ్ చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు. ఎమిలా కెర్ రెండు వికెట్లు తీసింది.

ఇక స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యస్తిక భాటియా (4) త్వరగా అవుటైంది. కాసేపటికే హేలీ మ్యాథ్యూస్ (13) కూడా పెవిలియన్ కు చేరింది. ఈ దశలో క్రీజులో ఉన్న సీవర్, హర్మన్ ప్రీత్ కౌర్ లు జట్టును ఆదుకున్నారు. వీరు మొదట నెమ్మదిగా ఆడి.. ఆ తర్వాత బ్యాట్ ను ఝుళిపించారు. దాంతో ముంబై ఇండియన్స్ లక్ష్యం వైపు సాగింది. అయితే కీలక సమయంలో హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ గా వెనుదిరిగింది. అయితే మరో ఎండ్ లో ఉన్న నాట్ సీవర్ అర్ధ సెంచరీతో జట్టును ఆదుకుంది. ఎమీలా కెర్ (8 బంతుల్లో 14 నాటౌట్) ధాటిగా ఆడింది. ఆఖరి ఓవర్లో 5 పరుగులు అవసరం కాగా.. తొలి రెండు బంతులకు మూడు పరుగులు వచ్చాయి. మూడో బంతిని ఫోర్ బాదిన సీవర్ మ్యాచ్ ను ఫినిష్ చేసి ముంబై జట్టును చాంపియన్ గా నిలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement