26/11 ముంబయి బాంబు పేలుళ్ల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సీనియర్ కమాండర్ అజామ్ ఛీమా గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ నగరంలో ప్రాణాలు కోల్పోయినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. మల్కాన్‌వాలాలో అజామ్‌కు అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం.
కేవలం 26/11 పేలుళ్ల ఘటన మాత్రమే కాకుండా ఇతర బాంబు పేలుళ్లకు అజామ్ సూత్రధారి. 2006లో ముంబయి రైళ్లలో జరిగిన బాంబు పేలుడు వెనుక అతని హస్తం ఉంది. నాటి ఘటనలో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. 800ల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఇది ఇలా ఉంటే పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు నవంబరు 26, 2008న ముంబయిలో మారణహోమానికి పాల్పడ్డారు. కొలాబా సముద్ర తీరం నుంచి ముంబయిలోకి ప్రవేశించారు. బృందాలుగా విడిపోయి అనేక చోట్ల విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు అమెరికన్లు కూడా ఉన్నారు. అజామ్ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాడని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. దాంతో అతని పేరును మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది.