Tuesday, November 26, 2024

Mumbai: డ్రగ్స్ కేసులో కీలక సాక్షి.. పూణే పోలీసుల అదుపులో కిరణ్ గోసవిని

సంచలనం సృష్టిస్తున్న ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షిగా పరిగణిస్తున్న కిరణ్ గోసవిపై 2018లో ఓ చీటింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో అతడి కోసం పూణే పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి, ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు పూణే పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా వెల్లడించారు.

డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కావడంతో ఈ వ్యవహారానికి విపరీతమైన ప్రాచుర్యం లభిస్తోంది. ఈ కేసులో కిరణ్ గోసవిని సాక్షిగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పేర్కొంది. కిరణ్ గోసవి తనను తాను ప్రైవేట్ డిటెక్టివ్ గా చెప్పుకునేవాడు. అతడికి ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తి బాడీగార్డు. సెయిల్ కూడా డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్నాడు. ఇటీవల సెయిల్ తన బాస్ కిరణ్ గోసవిపై సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే.

ఈ కేసు నుంచి ఆర్యన్ ఖాన్ ను తప్పించేందుకు గోసవి, ఎన్సీబీ మధ్య డీల్ కుదిరిందని సెయిల్ వెల్లడించాడు. రూ.25 కోట్లు చేతులు మారనున్నాయని తెలిపాడు. దీనిపై సెయిల్ కోర్టులో అఫిడవిట్ కూడా సమర్పించాడు. దాంతో ఈ కేసు మరింత జటిలంగా మారింది. ఇప్పుడు కిరణ్ గోసవిని ఓ పాత కేసులో పూణే పోలీసుల అదుపులో ఉండగా, అతడిని ఎన్సీబీ అధికారులు తమకు అప్పగించాలని కోరే అవకాశాలు ఉన్నాయి.

కిరణ్ గోసవిని విచారిస్తే డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక సమాచారం వెల్లడవుతుందని భావిస్తున్నారు. ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ అధికారుల అదుపులో ఉన్నప్పుడు గోసవి కూడా అతడి పక్కనే ఉండడం, అతడితో సెల్ఫీ తీసుకోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. కాగా, ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై బాంబే హైకోర్టులో నేడు కూడా విచారణ జరగనుంది. గత రెండ్రోజులుగా బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement