హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన సమ్మక్క-సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తరగతులు వచ్చే విద్యా సంవత్సరం (2023-24) నుంచే ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్టు సమాచారం. ఈ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్‌లో ఈ ఆదివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సమయంలో ఈ విషయం ప్రకటించిన సంగతి విదితమే.
ఢిల్లీలో బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.899 కోట్లను మంజూరు చేస్తూ ఆమోదం తెలిపింది. వచ్చే ఐదేళ్లలో ఈ విశ్వవిద్యాలయానికి అవసరమైన భవనాలను నిర్మించి ఇతర మౌలిక సదుపాయాలు, వసతి సౌకర్యాలను కల్పించాలని, నిర్మాణ పనులను వెనువెంటనే చేపట్టేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ మంత్రిమండలి సమావేశానికి హాజరైన విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరినట్టు.
గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత భవనాలు పూర్తయ్యే దాకా వరంగల్ పట్టణంలో భవనాలను అద్దెకు తీసుకుని పాలనా వ్యవహారాలను నిర్వహించాలని కేంద్ర విద్యా శాఖ ప్రతిపాదించినట్టు సమాచారం. వరంగల్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)లో ఉన్న భవనాల్లో తరగతులు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐదారు కోర్సులతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఈ వర్సిటీకి వెంటనే ప్రత్యేకాధికారి(ఓఎస్‌డీ)ని నియమించడంతో పాటు అవసరమైన సిబ్బందిని విధుల్లోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ అయినట్టు చెబుతున్నారు.
ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను చేర్చుకునే సంప్రదాయం ఉన్నందున వారికి ఉపయుక్తమయ్యే కోర్సులను గుర్తించి వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు చెబుతున్నారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని వెనువెంటనే పనుల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని కూడా కోరినట్టు సమాచారం.
వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయం, ఎన్‌ఐటీ ఉన్నందున అక్కడ లేని కోర్సులను గిరిజన వర్సిటీలో మొదలుపెట్టాలని, ఇందుకు ఒక కమిటీని ఎంపిక చేసి తెలంగాణకు పంపించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపు నిర్మాణ పనులు ఊపందుకునేలా చూడాలని, ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేసేలా ఆదేశాలు కూడా జారీ చేశానని ఆయన చెప్పినట్టు సమాచారం.
గిరిజన తెగలు, సంప్రదాయాలపై పరిశోధనలు
తెలంగాణాలో గిరిజన అక్షరాస్యత పెంపు దిశగా ఈ వర్సిటీలో పెద్ద ఎత్తున పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో లంబాడీలు, ఆదివాసీలు అధిక సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. మైదాన ప్రాంతంలో ఉన్న ఈ తెగలు బాగానే రాణిస్తున్నా.. నల్లమల అటవీ ప్రాంతంలో జనాలకు దూరంగా ఉంటూ అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న చెంచులు, సుగాలీలు, కొండ కాపులు; తదితర సామజిక వర్గాలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని; వారిని అన్ని రంగాల్లో వృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా పరిశోధనలు జరగాలని; ఇందుకోసం విరివిగా నిధులను కేటాయించాలని నిర్ణయించినట్టు- తెలుస్తోంది.