Friday, November 22, 2024

ములుగు ఫారెస్ట్​ కాలేజీకి మంచి గుర్తింపు.. రష్యా, చైనా తర్వాత మూడో అటవీ వర్సిటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించిన ములుగు అటవీ కాలేజీ ఇప్పుడు దేశంలోనే మొదటి అటవీ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. రష్యా, చైనా దేశాల తర్వాత ప్రపంచంలో అటవీ యూనివర్సిటీ ములుగులోనే ఉన్నది. సాంకేతిక విద్యలకు ధీటుగా అటవీ విద్యకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ఫారెస్ట్‌ కాలేజీ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎఫ్‌సిఆర్‌ఐ)ను 2016లో నెలకొల్పారు. ఈ సంస్థ యూనివర్సిటీగా మారుతున్న తరుణంలో అందుకు అవసరమైన మౌళిక సదుపాయాలు, పాలన, నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అంతర్జాతీయంగా పర్యావరణ మార్పులు, జీవ వైవిధ్యానికి పెరిగిన ప్రాధాన్యత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అటవీ విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఎఫ్‌సిఆర్‌ఐ క్యాంపస్‌ నుంచే జాతీయ స్థాయి పర్యావరణ నిపుణులు, అఖిల భారత స్థాయి అధికారులను అందించేలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష.

అందుకనుగుణంగా ఎఫ్‌సిఆర్‌ఐలో ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన విద్యార్థులు దేశంలో పేరెన్నిక గల డెహ్రాడూన్‌ ఫారెస్ట్‌ రీసెర్చ్‌ సంస్థ, బనారస్‌ హిందూ యూనివర్సిటీ, ఐకార్‌ వంటి చోట్ల చదువుతున్నారు. ఇటీవలే ఒక విద్యార్థి ఇండియన్‌ ఫారెస్టు సర్వీస్‌ను సాధించాడు. సీఎం ఓఎస్డీగా మొదట్నుంచీ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియంకా వర్గీస్‌ ములుగు ఫారెస్టు కాలేజీ డీన్‌గా కొనసాగుతున్నారు. ఆమె పర్యవేక్షణలో కాలేజీ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొంది, యూనివర్సిటీగా మారబోతుంది. పర్యావరణ హితం కోసం హరితహారం అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో ఫారెస్టు కాలేజీని యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేయడం గొప్ప విషయమని ప్రియాంక వర్గీస్‌ పేర్కొన్నారు. అటవీ విద్యకు ప్రాధాన్యత పెరగడంతో పాటు, గ్రామీణ యువతకు మంచి అవకాశాలు దక్కుతాయని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement