ములుగు, ప్రభన్యూస్ ప్రతినిధి : రాష్ట్రంలో మొదటిసారిగా కంటైనర్ స్కూల్ ( ప్రీ ఫ్యాబ్రికేటెడ్)ను ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బంగారుపల్లి గుత్తికోయి గూడెం గ్రామంలో నిర్మించారు. ఎన్నో అభ్యంతరాలతో పాఠశాల భవనాలు లేని ఆదివాసీ, అటవీ ప్రాంత గూడెం విద్యార్థులకు కంటైనర్ స్కూల్ ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. బంగారుపల్లి గుత్తికోయి గూడెం అనే మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసిన కంటైనర్ స్కూల్‌ను మంగళవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు.
ఇటీవల కంతనపల్లి ప్రాజెక్టు సందర్శనకు మంత్రుల బృందం వచ్చిన క్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆ గ్రామాన్ని పరిశీలించారు. గుత్తి కోయ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. పాఠశాల నిర్వహిస్తున్న పూరిపాకలోకి విష పురుగులు వస్తున్నాయని గ్రామస్థులు చెప్పారు. ఏ మాత్రం వర్షం పడినా ఆ రోజు బడికి సెలవు ప్రకటిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల దీన స్థితి చూసి కలెక్టర్ చలించిపోయారు. పక్కనే ఉన్న అధికారులతో మాట్లాడారు. ఫారెస్టు అధికారుల నుంచి అనుమతి లేకపోవడంతో పాఠశాల భవనం నిర్మించలేకపోయామని విద్యాశాఖ అధికారులు చెప్పారు.
ఇందుకు ఆయన స్పందించి రూ. 13 లక్షలతో కంటైనర్ స్కూల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కంటైనర్ పాఠశాల 25 అడుగుల పొడవు, అలాగే 25 అడుగుల వెడల్పు ఉంటుంది. 12 డ్యూయల్ డెస్కులు, మూడు కుర్చీలు సరిపడిన విధంగా నిర్మించారు.
గూడెంలో విద్యా వెలుగులు…
మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న గల ఛతీస్‌గడ్ రాష్ట్రంలో మనుగడ కష్టమవుతుందని భావించి సరిహద్దులో ఉన్న తెలంగాణలోని ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బంగారుపల్లిలో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సుమారు పదిహేనేళ్లుగా ఇక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. బంగారు పల్లి గుత్తి కోయ గూడెంలో 36 కుటుంబాలు ఉన్నాయి. సుమారు 130 మంది జనాభాలో 27 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలను ప్రారంభించింది.
2020-21లో సమగ్ర శిక్షణ కింద నిధులు పాఠశాల భవనానికి అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇక్కడ భవన నిర్మాణానికి అధికారులు సన్నాహాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అభ్యంతరం చెప్పారు. బంగారు పల్లి గుత్తి కోయగూడెం పూర్తిగా అటవీ శాఖ పరిధిలో ఉందని, పాఠశాల భవన నిర్మాణానికి అనుమతులను అటవీశాఖ నిరాకరించింది. దీంతో పాఠశాల భవన నిర్మాణానికి మంజూరైన నిధులు వెనక్కి వెళ్లిపోయాయి.
అప్పటి నుంచి పాఠశాలను ఓ పూరిపాకలో నిర్వహిస్తున్నారు. మరో మూడు గూడెంలకు మోక్షం కలిగేనా..మరో మూడు గూడెల్లో కంటైనర్ స్కూళ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి, మామిడి గూడెం, రామకృష్ణాపూర్ గ్రామాల్లో గుత్తికోయ పిల్లలు విద్యాభ్యాసానికి ఆమడ దూరంలో ఉన్నారు. వీరంతా ఛత్తీస్‌గడ్ నుంచి వలస వచ్చి తెలంగాణలో స్థిరపడుతున్నారు. వారు నివసించే గ్రామాలు పూర్తిగా అటవీశాఖ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో భవనాలను నిర్మించడానికి అటవీశాఖ అనుమతులను నిరాకరించింది.
దీంతో పూరి గుడిసెల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. అసలే అటవీ ప్రాంతం కావడంతో ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియదు. ఆయా గ్రామాల్లో కూడా కంటైనర్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాలకు చెందిన గుత్తికోయ తెగ వారు కోరుతున్నారు.
కంటైనర్ స్కూల్ చాలా బాగుంది
మా గూడెంలో చాలా రోజుల నుంచి పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. పూరిపాకలో తరగతులు చెప్పడానికి అటు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. అలాగే మాకు పాఠశాల భవనానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ అటవీశాఖ అధికారులు అడ్డు చెప్పడంతో ఆగిపోయింది. కలెక్టర్ వద్ద మా సమస్యలు చెబితే మాకు కంటైనర్ పాఠశాల నిర్మించి ఇచ్చారు. – దూది విజయ్, బంగారుపల్లి, గ్రామం, కన్నాయి గూడెం మండలం