ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు సీతక్క తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర యాత్రలో సీతక్క పాల్గొన్నారు. దాదాపు నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎమ్మార్వో కార్యాలయంలో మెమొరాండం ఇచ్చిన తర్వాత సీతక్క అస్వస్థతకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో సీతక్కను కార్యకర్తలు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అక్కడ డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేరు. దీంతో సీతక్క అభిమానులు, పార్టీ కార్యకర్తలు డాక్టర్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డ్యూటీ సమయంలో అందుబాటులో ఉండని డాక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సీతక్క ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.