Friday, November 22, 2024

మల్టి మోడల్‌ లాజిస్టిక్‌ పార్కు ఆలస్యం..! హైదరాబాద్‌లో ఏర్పాటుపై అధ్యయనం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారత్‌ మాల పరియోజన స్కీమ్‌ కింద రాష్ట్రానికి మల్టి మోడల్‌ లాజిస్టిక్‌ పార్కు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. వాయు, రోడ్డు, రైల్వే మార్గాలను అనుసంధానిస్తూ శంషాబాద్‌లో మల్టి మోడల్‌ లాజిస్టిక్‌ పార్కు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. రూ.300 కోట్లతో శంషాబాద్‌లో ఈ పార్కును ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో ఈ ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తెలంగాణకు రావాల్సిన ఎన్నో ప్రాజక్టుల్లానే మల్టి మోడల్‌ లాజిస్టిక్‌ పార్కు విషయంలోనూ కేంద్రం మొండిచేయి చూపిస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజగా భారత్‌ మాల పరియోజన స్కీమ్‌లో భాగంగా తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి మల్టి మోడల్‌ లాజిస్టిక్‌ పార్కును మంజూరు చేయడమే కాకుండా దీని అభివృద్ధికి సంబంధించి కాంట్రాక్టు సంస్థల నుంచి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ బిడ్లు కూడా ఆహ్వానించింది. రెవెన్యూ షేరింగ్‌ పద్ధతిలో అభివృద్ధి చేయనున్న ఈ పార్కు నిర్మాణానికి కాంట్రాక్టు ఏజెన్సీని కూడా త్వరలో కేంద్రం తుది ఎంపిక చేయనుంది. అనంతరం పార్కు అభివృద్ధి ప్రారంభం కానుంది. చెన్నై తర్వాత కర్ణాటక రాజధాని బెంగళూరు, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నగరాలలో మల్టి మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల అభివృద్ధికి కేంద్రం బిడ్లు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న భారత్‌మాల పరియోజనలో భాగంగా మల్టి మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.46 వేల కోట్లు కేటాయించింది.

హైదరాబాద్‌పై కొనసాగుతున్న ఫీజబులిటి స్టడీ…

దేశంలో చెన్నై, బెంగళూరు నగరాల్లో ఇప్పటికే మల్టి మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు ప్రారంభించగా హైదరాబాద్‌ నగరంలో లాజిస్టిక్‌ పార్కుకు సంబంధించి ఇంకా ఫీజబులిటీ అధ్యయనం చేస్తున్నామని కేంద్రం చెబుతోంది. హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్నంలోనూ మల్టి మోడల్‌ లాజిస్టిక్‌ పార్కు ఏర్పాటుపై ఫీజబులిటీ అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని నగరం శివార్లలోని బాట సింగారంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్‌ పార్కును అభివృద్ధి చేయడంతో పాటు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి తోడు హైదరాబాద్‌లో మల్టి మోడల్‌ లాజిస్టిక్‌ పార్కు ఏర్పాటైతే సరుకురవాణా మరింత సులభతరమవడమే కాకుండా రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులు రావడానికి అవకాశముంటుందని పరిశ్రమల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement