ఆసియా కుబేరుడు ముకేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కీలకమైన అడుగువేసింది. దేశీయ రోబోటిక్స్ కంపెనీ యాడ్‌వర్బ్‌లో 54 శాతం వాటాను కొనుగోలు చేసింది. 132 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.983 కోట్లు)తో ఈ వాటాను కొనుగోలు చేసినట్టు రోబోటిక్ సంస్థకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. యాడ్‌వర్బ్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సంగీత్ కుమార్ స్పందిస్తూ.. స్వతంత్రంగా నిర్వహణను కంపెనీ కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి పొందిన నిధులను విదేశాల్లో వ్యాపార విస్తరణతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దేశంలోనే అతిపెద్ద రోబోటిక్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వివరించారు. ఇప్పటికే నోయిడాలో ఒక రోబోటిక్ తయారీ కేంద్రం ఉంది. దీని నుంచి ఏడాదికి దాదాపు 10 వేల రోబోలను తయారు చేస్తున్నామని తెలిపారు.
ఈ పెట్టుబడితో యాడ్‌వర్బ్‌లో 54 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దక్కించుకుంటుంది. కంపెనీలో అతిపెద్ద షేర్ హోల్డర్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలుస్తుంది. ఇప్పటికే తమ కీలకమైన స్టమర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా ఉంది. జియోమార్ట్ గ్రాసరీ బిజినెస్ కోసం ఇప్పటికే ఆటోమేటెడ్ వేర్‌హౌస్‌ను సృష్టించడంతోపాటు సేవలు అందిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ఇరు కంపెనీల మధ్య పరస్పర విశ్వాసం ఉంది. తమ భాగస్వామ్యంతో మరింత ముందుకు కొనసాగుతామని కుమార్ అన్నారు. రిలయన్స్ రిటైల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం 5జీ సేవలు, బ్యాటరీ టెక్నాలజీ అంశాల్లో దోహదపడనుంది. నూతన ఇంధన ఆవిష్కరణలు, మెటీరియల్ సైన్స్ టెక్నాలజీలో ఆధునాతనత ద్వారా మరిన్ని ఆవిష్కరణలతోపాటు సరసమైన ధరలకే రోబోలను అందుబాటులోకి తీసుకురానున్నామని ఆయన పేర్కొన్నారు.
రిల్ ఫండ్స్‌తో విదేశాల్లో విస్తరణ
యాడ్‌వర్బ్ కంపెనీ లాభాల్లో ఉందని కుమార్ ప్రస్తావించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పెట్టుబడులను విదేశాల్లో విస్తరణ కోసం వినియోగించుకుంటామని యాడ్‌వర్బ్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సంగీత్ కుమార్ వివరించారు. ప్రస్తుతం కంపెనీ ఆదాయంలో 80 శాతం భారత్ నుంచే వస్తోంది. అయితే రానున్న 4-5 ఏళ్లలో ఆదాయం భారత్, విదేశాల మధ్య 50:50 శాతంగా ఉండాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. సాఫ్ట్‌వేర్ రంగం సహకారంతో వచ్చిన ఆదాయం స్థూల ఆదాయంలో 15 శాతంగా ఉంది. రానున్న సంవత్సరాల్లో ఈ రంగం నుంచి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. కాగా యాడ్‌వర్బ్ కంపెనీని 2016లో స్థాపించారు. ప్రస్తు ఆర్థిక సంవత్సరంలో 100 శాతం వృద్ధితో రూ.400 కోట్ల ఆదాయాన్ని నమోదుచేయొచ్చని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. రానున్న 5-6 ఏళ్లలో ఒక బిలియన్ డాలర్ కంపెనీగా అవతరించాలని భావిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. డిజైన్, తయారీ, ప్రపంచవ్యాప్తంగా డెలివరీ సహా భారత్‌లో అన్ని అంశాల్లో రాణించగలమని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక యాడ్‌వర్బ్ కంపెనీ అనుబంధ కంపెనీలు సింగపూర్, నెదర్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియాలలో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..