రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దేశంలో అత్యధిక ధనవంతుడిగా ఆయన తన స్థానాన్ని తిరిగి సాధించారు. ఈ సంవత్సరం ఆయన సంపద 2 శాతం పెరిగింది. ఈ జాబితాలో గత సంవత్సరం అగ్రస్థానంలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత గౌతమ్ అదానీ సంపద 57 శాతం తగ్గింది. హిండెన్‌బర్గ్ నివేదిక మూలంగానే అదానీ సంపద భారీగా తగ్గిందని హురున్ ఎండీ అనస్ రెహ్మాన్ జునైద్ చెప్పారు.
ఇండియా ధనవంతుల జాబితాను ప్రతి సంవత్సరం హురున్ ఇండియా, 360 ఒన్ వెల్త్ బుధవారం నాడు ఈ జాబితాను విడుదల చేశాయి. ఇది 12వ వార్షిక ధనవంతుల ర్యాంకింగ్ జాబితా. ఈ సారి జాబితాలో టాప్ 10లో ఉన్న వారిలో 8 మంది సంపద పెరిగింది. కేవలం గౌతమ్ అదానీ, డిమార్ట్ అధినేత రాధాకృష్ణ దమానీల సంపద మాత్రం తగ్గింది. ముఖేష్ అంబానీ 2023 జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
గత పది సంవత్సరాలల్లో రిలయన్స్ వివిధ వ్యాపారాలపై 150 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. 2014లో ఆయన సంపద విలువ 1.65 లక్షల కోట్లు. 2023లో ఆయన సంపద 8.08 లక్షల కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం అగ్రస్థానంలో ఉన్న అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 2023 ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఆయన నికర సంపద 4.74 లక్షల కోట్లుగా ఉంది.
.గత సంవత్సరం వరకు ఆయన వరసగా 5 సంవత్సరాల పాటు దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. 2019లో గౌతమ్ అదానీ సంపద 94,500 కోట్ల నుంచి ఐదు రెట్లు పెరిగింది. సిరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ ఎస్ పూనావాలా మూడో స్థానంలో నిలిచారు.
ఆయన సంపద 2.78 లక్షల కోట్లుగా ఉంది. హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ జాబితాలో తన 4వ స్థానాన్ని ఈ సారి కూడా నిలుపుకున్నారు. ఆయన సంపద 2.29 లక్షల కోట్లుగా ఉంది. ధనవంతుల జాబితాలో గోపిచంద్ హిందుజా అయన కుటుంబం 1.76 లక్షల కోట్ల సంపదతో 5వ స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ 1.64 లక్షల కోట్లతో 6వ స్థానంలో ఉన్నారు. ఎల్‌ఎన్ మిట్టల్ అండ్ ఫ్యామిలీ సంపద 1.62 లక్షల కోట్లతో 7వ స్థానంలో ఉన్నారు.
ఎవెన్యూ సూపర్‌మార్ట్స్(డీమార్ట్) అధినేత రాధాకృష్ణ దమానీ 1.44 లక్షల కోట్ల సంపదతో 8వ స్థానంలో ఉన్నారు. తరువాత వరసగా అదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన కుమార మంగళం బిర్లా అండ్ ఫ్యామిలీ సంపద 1.25 లక్షల కోట్లుతో 9వ స్థానంలో ఉన్నారు. నీరజ్ బజాజ్ అండ్ ఫ్యామిలీ సంపద 1.2 లక్షల కోట్లతో 10 స్థానంలో ఉన్నారు. జోహోకు చెందిన రాధా వెంబు ఈ జాబితాలో నైనాకు చెందిన ఫల్గుణి నయ్యర్‌ను అధిగమించి అత్యంత సంపన్న భారతీయ మహిళగా నిలిచారు.
ఈ జాబితాలో స్ట్రీమింగ్ డేటా టెక్నాలజీ కంపెనీ ఇన్‌ఫ్లూయెంట్ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖేడ్ అతి చిన్న వయసున్న సంపన్న పారిశ్రామికవేత్తగా నిలిచారు. జాబితాలో ఉన్న వారి సంపద గత ఐదు సంవత్సరాల్లో 76 శాతం పెరిగింది. సంపద పరంగా 109 లక్షల కోట్లు పెరిగింది. ఈ సారి జాబితాలో 64 శాతం మంది స్వయం కృషితో సంపదలో అగస్థానానికి చేరుకున్నారని 360 ఒన్ వెల్త్ జాయింట్ ఈసీఓ యతిన్‌షా చెప్పారు.
ఆగస్టు 30 నాటికి సంపద ఆధారంగా దేశవ్యాప్తంగా 1,39 మందితో ధనవంతుల జాబితాను హురున్ విడుదల చేసింది. 94 సంవత్సరాల వయస్సులో ప్రెసిషన్ వైర్స్ ఇండియాకు చెందిన మహేంద్ర రతిలాల్ మెహతా ఈ జాబితాలో తొలిసారి స్థానం సంపాదించారు. ప్రస్తుతం దేశంలో 259 మంది మిలియనీర్లు ఉన్నారు. అత్యధికంగా ముంబై నుంచి హురున్ ధనవంతుల జాబితాలో 328 మంది ఉన్నారు.
ఢిల్లిలో 199 మంది, బెంగళూర్‌లో100 మంది తరువాత స్థానాల్లో ఉన్నారు. తిరుప్పూర్ అత్యధిక సంఖ్యలో ధనవంతులను అందించిన మొదటి 20 నగరాల జాబితాలో చేరింది. కెదారా క్యాపిటల్‌కు చెందిన మనీష్ కేజ్రీవాల్ ప్రైవేట్ ఈక్విటీ రంగ నుంచి ధనవంతుల జాబితాలో చేరిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఆయన సంపద విలువ 3వేల కోట్లు.
భారత్‌లో అత్యంత ధనవంతుల జాబితాలో 2023 జాబితాలో బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ స్థానం కోల్పోయారు. ఆయన వ్యక్తిగత సంపద 3.3 బిలియన్ డాలర్లుగా ఉంది. సంవత్సర కాలంగా బైజూస్ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఆయన సంస్థలో పెట్టుబడులు పెట్టిన ప్రముఖ సంస్థలు తప్పుకున్నాయి. ఫలితంగా బైజూస్ నికర విలువలో క్షీణత ఏర్పడింది. ఫలితంగా ఆయన సంపద కూడా తగ్గింది.