హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎంటెక్ సీట్లు భారీగా తగ్గిపోతున్నాయి. ప్రతి విదయా సంవత్సరంలో సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. గత ఎనిమిదేళ్లలో చూసుకుంటే వెయ్యి నుంచి 6 వేల వరకు ప్రతి ఏడాది సీట్లు తగ్గుతూవచ్చాయి. ఒకప్పుడు ఎంటెక్ విద్యకు యమక్రేజ్ ఉండేది. ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యతోటే మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తుండటంతో ఇంజనీరింగ్ విద్యార్థులు తమ విద్యను బీటెక్‌తోటే ఆపేస్తున్నారు. దీంతో సీట్లు మిగిలిపోతుండటంతో కళాశాలలు మూతపడుతున్నాయి. ఎంటెక్‌లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించకపోవడంతో ఇక చేసేదిలేక కాలేజీ యాజమాన్యాలు సీట్లను తగ్గించుకుంటున్న పరిస్థితి ఉంది. 2014-15లో 41వేలకు పైగా ఎంటెక్ సీట్లు ఉంటే ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం 2022-23లో 11,350 వరకు మాత్రమే ఉన్నాయి. గతేడాదిలో దాదాపు 12,250 వరకు సీట్లు ఉంటే ఈ ఏడాదిలో ఆ సంఖ్య 11,350 తగ్గింది. ఈ తొమ్మిదేళ్లలో ప్రతి ఏడాది సీట్లు తగ్గుతూ వస్తున్నాయి.
రాష్ట్రంలో తగ్గిన కాలేజీలు…
గతంలో మాదిరిగా ఏ కోర్సు పడితే ఆ కోర్సును చేసేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు. మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే కోర్సులనే ఎంచుకుంటున్నారు. అటువైపే వెళ్తున్నారు. ప్రస్తుతం బీటెక్ పూర్తి చేసి దానికి అనుబంధంగా ఏదైనా కంప్యూటర్ కోర్సు చేస్తే మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. మన దగ్గర ఎంటెక్ కాకుండా విదేశాల్లో ఎంఎస్ చేస్తే అక్కడే మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. లేదా అక్కడ ఎంఎస్ చేసి ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంటెక్ సీట్లు తగ్గిపోయి కాలేజీలు మూతపడుతున్నాయి. ఒకప్పుడు ఎంటెక్ కాలేజీలు 298 ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 130 వరకు తగ్గింది.
ఏటా విదేశాలకు 25 వేల మంది…
చాలా మంది విద్యార్థులు బీటెక్ సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత కోర్సుల్లోనే జాయిన్ అవుతున్నారు. బీటెక్ చేసిన తర్వాత వెంటనే ప్రాంగణ నియామకాల్లో మల్టి నేషనల్ కంపెనీల్లో ఇంటర్వ్యూలకు హాజరై భారీ ప్యాకేజీలతో అక్కడ ఉద్యోగాల్లో చేరుతున్నారు. మరి కొంత మంది విదేశాల్లో ఎంఎస్ చేసేందుకు వెళ్తున్నారు. ప్రతి ఏటా సుమారు 25 వేల నుంచి 30 వేల మంది ఎంఎస్ చేయడానికి మన రాష్ట్రం నుంచి వెళ్తున్నారు. మరి కొంత మంది బోధన వృత్తిని ఎంచుకుంటున్నారు. ఈ రకంగా రాను రాను ఎంటెక్ సీట్లు, ఆ కోర్సును అందించే విద్యా సంస్థలూ తగ్గిపోతున్నాయి. బీటెక్‌తోనే మంచి జీతంతో ఉద్యాగావకాశాలు వస్తుండటంతో భారీగా ఫీజులు కట్టి ఎంటెక్‌లో చేరడం ఎందుకనే భావనలో విద్యార్థులు ఉంటున్నట్లు తెలుస్తోంది.