కరోనా చికిత్సకు వినియోగించే 2 డీజీ ఔషధ ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి లభించింది. హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్.. ఈ ఔషధ ఉత్పత్తికి సంబంధించి డీఆర్‌డీవోతో ఒప్పందం కుదుర్చుకుంది. డీఆర్‌డీవో డెవలప్ చేసిన 2 డీజీ ఔషధాన్ని కరోనా రోగులకు అత్యవసరంగా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే డీఆర్‌డీవోతో ఎంఎస్ఎన్ ల్యాబ్ ఒప్పందం మేరకు.. 2 డీజీ ఔషధాన్ని ఎంఎస్ఎన్ 2డీ పేరుతో ఎంఎస్ఎన్ ల్యాబ్ మార్కెట్‌లోకి తీసుకురానుంది. 2.34 గ్రాములతో రోజుకు రెండు సాచెట్స్‌ను సదరు ల్యాబ్ ఉత్పత్తి చేయనుంది.
ఇప్పటికే ఎంఎస్ఎన్ ల్యాబ్ పలు రకాల కొవిడ్ మెడిసిన్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. యాంటీ వైరల్ మెడిసిన్స్‌ను ఒసెలో బ్రాండ్ పేరుతో ఓసెల్టామివిర్ క్యాప్సూల్స్‌ను విడుదల చేసింది. ఫావిలో బ్రాండ్ పేరుతో ఫావిపిరవిర్ వంటి యాంటీ కోవిడ్ మందులను, బారిడోజ్ బ్రాండ్ పేరుతో బారిసిటినిబ్, పోసాయోన్ బ్రాండ్ పేరుతో పోసాకోనజోల్ వంటి యాంటీ ఫంగల్ మెడిసిన్స్‌ను ఎంఎస్ఎన్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇది కూడా చదవండి: సెప్టెంబరు నుంచి చిన్నారులకు టీకా