Friday, November 22, 2024

Delhi | ఎంఆర్పీఎస్ విశ్వరూప పాదయాత్ర.. అక్టోబర్ 4న అలంపూర్‌లో ప్రారంభం: మంద‌కృష్ణ‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ కోసం మాదిగల విశ్వరూప పాదయాత్ర చేపట్టనున్నట్టు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ప్రకటించారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, అక్టోబర్ 4న ఆలంపూర్ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించనున్నట్టు తెలిపారు. ముగింపు సభను హైదరాబాద్ శివార్లలో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ కోసమే తాము చాలాకాలంగా పోరాటం చేస్తున్నామని, వర్గీకరణ లేకపోవడం కారణంగా రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వర్గీకరణకు సానుకూలంగా స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే హామీ ఇచ్చారని, ఆ సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఉన్నారని గుర్తుచేశారు. కానీ ఇంతవరకు బిల్లు పెట్టకపోవడం శోచనీయమని అన్నారు. రాజకీయ పార్టీలు తీర్మానాలు చేస్తున్నాయి తప్ప అమలు చేయడం లేదని మంద కృష్ణ అన్నారు. వర్గీకరణకు సానుకూలంగా డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ పార్టీ సైతం ప్రధాన మంత్రి ఇంతవరకు లేఖ రాయలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి ఉద్యమించాల్సి వచ్చిందని, ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement