Tuesday, November 26, 2024

అదిగ‌దిగో మృగశిర కార్తె .. జూన్‌ 9న చేప ప్రసాదం పంపిణీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మృగశిర కార్తె సందర్భంగా జూన్‌ 9న నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లపై సచివాలయంలో మంగళవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, మత్స్యశాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్యా, చేప ప్రసాదం పంపిణీ చేసే బత్తిన సోదరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ చేప ప్రసాదం పంపిణీకి సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయనుందన్నారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి సంవత్సరం చేప ప్రసాదం పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోందని గుర్తు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా చేప ప్రసాదం పంపిణీ చేయలేదని, తిరిగి ఈ ఈసంవ్తసరం నుంచి చేప ప్రసాదం పంపిణీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చేప ప్రసాదం కోసం తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుండి కూడా లక్షలాది మంది వస్తుంటారని చెప్పారు. సాధారణ ప్రజలకు వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలకు వేర్వేరుగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

చేప మందు కోసం వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్ల ఏర్పాటుతోపాటు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రసాదానికి అవసరమైన చేప పిల్లలను కూడా ప్రభుత్వమే మత్స్యశాఖ ద్వారా సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. ఏర్పాట్లపై ఈ నెల 25వ తేదీన వివిధ శాఖల అధికారులతో నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌ లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బత్తిని సోదరులు గౌరీ శంకర్‌గౌడ్‌, శివశంకర్‌గౌడ్‌, అమర్నాథ్‌గౌడ్‌, అలకానంద తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement