పెట్రోలియం, సహజవాయువు సంస్థలు భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని రాజ్యసభ సభ్యుడు, పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలలో అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్వహించే విషయంలో దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
చెన్నై, గోవాలో పెట్రోలియం, సహజవాయువు సంస్థలపై వారం రోజుల అధ్యయనం కోసం చేపట్టిన పర్యటన ముగిసింది. గోవాలోని ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ (ఐపీఎస్‌హెచ్‌ఈఎం)ని దాని చైర్మన్ రమేష్ బిధూరి నేతృత్వంలోని కమిటీ సోమవారం సందర్శించినట్లు ఎంపీ కార్యాలయం తెలిపింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రవిచంద్ర మాట్లాడుతూ.. భద్రత విషయంలో రాజీ పడకూడదని అభిప్రాయపడ్డారు. చమురు కంపెనీల్లో భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పలు చమురు కంపెనీల ప్రతినిధులు, వాటి నిపుణులతో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీల్లో అమలవుతున్న భద్రతా చర్యలను కమిటీ సమీక్షించింది. కాగా, పలు సూచనలు చేసి, వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని నిపుణులను కోరింది. చెన్నైలో మానవ వనరుల విధానంపై సమావేశం కూడా జరిగింది.