హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతున్నది. దాదాపు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందనే అభిప్రాయం వచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటమిని అంగీకరించారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాల్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగిన ముగ్గురు ఎంపీల ఓడిపోగా.. కాంగ్రెస్ నుంచి అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలిచిన ముగ్గురు ఎంపీలు గెలిచారు. బిఆర్ఎస్ నిలిపిన ఓకే ఒక ఎంపి కొత్త ప్రభాకరరెడ్డి దుబ్బాక నుంచి గెలుపొందారు..
బీజేపీ నుంచి బండి సంజయ్ (కరీంనగర్ ఎంపీ) కరీంనగర్ నుంచి, ధర్మపురి అరవింద్ (నిజామాబాద్ ఎంపీ) కోరుట్ల నుంచి, సోయం బాపూరావు (ఆదిలాబాద్ ఎంపీ) బోథ్ నుంచి పోటీలో నిలిచారు. అయితే.. ఈ ముగ్గురూ ఓడిపోయారు.
అదే కాంగ్రెస్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిణామం చోటుచేసుకుంది. మల్కాజ్‌గిరీ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఘన విజయం సాధించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బంపర్ మెజార్టీతో గెలిచారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా విజయాన్ని నమోదు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ఎంపీని అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక నుంచి పోటీలో నిలిపింది. ఆయన సమీప అభ్యర్థి, బీజేపీ నేత రఘునందన్ రావు పై కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.