Friday, November 22, 2024

ఉచిత పథకాలతో ఖజానాలు ఖాళీ!

ఉచిత పథకాలకు అడ్డుకట్ట వేయాలిరాష్ట్రాల్లో ఉచిత పథకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ ప్రధాని మోదీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఉచిత పథకాలలో రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని.. తమ పదవీ కాలంలో వచ్చే ప్రతి ఎన్నిక సందర్భంలోనూ ప్రజలకు కానుకలిచ్చి ఎన్నికల లబ్ధి పొందే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి కీలక అంశాలు విస్మరించి వాటి నిధులను కూడా ఓట్ల కోసం ఉచితాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలను నియంత్రించాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు. ఉచిత పథకాల పరంపరకు చట్టం ద్వారా నియంత్రణ తీసుకురావాలని ప్రధానిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలు ప్రజలను నిరంతర యాచకులుగా మారుస్తోందని … తద్వారా బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యపడదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ఖజానాలను ఉచితాలకు పంచిపెట్టి మరిన్ని నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య కేంద్రం వివక్ష చూపుతోందనే ఆరోపణలకు ఇదే మూలకారణమని రఘురామకృష్ణంరాజు చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో ఉచితాలకు కేటాయింపులపై పరిమితి విధించడం, ఈ కానుకల అందించే సమయంపై నియంత్రణ తీసుకురావడం ద్వారా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టవచ్చని రఘురామకృష్ణంరాజు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement