న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీతోనే ప్రమాదం పొంచి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. గురువారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ (ఎక్స్)లో గురువారం ఉదయం లోకేశ్ ట్వీట్ చేస్తూ జైల్లో తన తండ్రి చంద్రబాబు నాయుడుకు ప్రాణహాని ఉందని, దోమల ద్వారా ఆయన అనారోగ్యం పాలయ్యేలా చేసి హతమార్చే కుట్ర చేస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు.
జైల్లో ఓ ఖైదీ చనిపోయిన ఉదంతాన్ని ఉదహరించారు. ఈ పోస్టుపై స్పందిస్తూ ఎంపీ సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు హాని తలపెట్టే ఉద్దేశం, అవసరం తమకు లేనే లేదని, అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే లోకేశ్ లేదా టీడీపీ నేతలకే ఉంటుందని అన్నారు. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉందని, ఆయన కుమారుడు కూడా అలాగే ఆలోచిస్తూ ఉండొచ్చని విమర్శించారు.
తండ్రి అడ్డు తొలగిపోతే తాను పార్టీని చేజిక్కించుకోవచ్చు అన్న ఆలోచనలు ఏమైనా ఉంటే నారా లోకేశ్‌కే ఉండి ఉంటాయని అన్నారు. జైళ్ల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ నేతలు ఏమైనా చేస్తారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు హాని కల్గితే అందుకు తెలుగుదేశం పార్టీయే కారణం తప్ప మరెవరూ కాదని అన్నారు. ఎవరికీ భయపడని వ్యక్తి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు విషయంలో దోమలకు భయపడుతున్నారా అంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ హావభావాలు, బూతులపై అసహనం వ్యక్తం చేశారు. సినిమాల్లోనూ ప్రదర్శించడానికి వీల్లేనటువంటి హావభావాలతో అసహ్యంగా ప్రవర్తించారని విమర్శించారు. మెంటల్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి బాలకృష్ణ ఎమ్మెల్యే పదవికి అనర్హుడని, ఆ సర్టిఫికేట్ ఆధారంగా బాలకృష్ణను అనర్హుడిగా ప్రకటించాలని సురేశ్ డిమాండ్ చేశారు.
లోకేశ్ ఢిల్లీలో ఎందుకు దాక్కున్నారు?
తండ్రి విడుదల కోసం న్యాయనిపుణులతో చర్చల కోసం అంటూ ఢిల్లీ వచ్చిన నారా లోకేశ్, ఇక్కడే ఎందుకు దాక్కున్నారో చెప్పాలని నందిగం సురేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ తిరిగి వెళ్తే అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారని అన్నారు. ఎందుకంటే సూట్ కేసులు మోసిన వ్యవహారంలో లోకేశ్ కూడా పాత్రధారి అని, తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారని సూత్రీకరించారు. రఘురామ కృష్ణంరాజు దగ్గర ఆశ్రయం పొందుతున్నారని విమర్శించారు.
పార్లమెంట్ లోపల గాంధీ విగ్రహం వద్ద 5 నిమిషాలు ధర్నా చేసి, ఫోటోలు వచ్చాయి కదా ఇక చాలు అంటూ లేచి వెళ్లిపోయారని నారా లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు. లోకేశ్‌కు తండ్రి కోసం ఏదో చేస్తున్నట్టు ప్రచారం కావాలని తప్ప నిజంగా తండ్రి మీద చిత్తశుద్ధి లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు చరిత్ర తెలిసిన ఏ ఒక్కరూ ఆయనకు సానుభూతి తెలపరని వ్యాఖ్యానించారు. బాబును చూస్తే ఎవరైనా వెన్నుపోటు వీరుడు అంటారని, అలాగే ఎక్కడా గెలవకపోయినా తండ్రి సీఎం అయితే తాను మంత్రి అవ్వొచ్చని లోకేశ్‌ను చూస్తే తెలుస్తుందని విమర్శించారు.