Saturday, November 23, 2024

మోదీని దూషిస్తే మీరు సహిస్తారా, అతని అనర్హతపై ఎందుకింత తాత్సారం.. ప్రివిలేజ్ కమిటీలో ఎంపీ మార్గాని భరత్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఎవరైనా ప్రధాని మోదీని దూషిస్తూ చూస్తూ ఊరుకుంటారా అని వైఎస్సార్సీపీ ఎంపీ, చీఫ్ విప్ మార్గాని భరత్ ప్రశ్నించారు. సోమవారం ఢిల్లీలో లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ విచారణకు హాజరైన అనంతరం ఆయన్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా బీజేపీ తీరుపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అనర్హత వేటు విషయంలో తాత్సారం చేయకుండా త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నానంటూ రఘురామకృష్ణ రాజు అతితెలివి ప్రదర్శిస్తున్నారని, కానీ ఆయన వ్యవహార శైలి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం నేరమే అవుతుందని భరత్ అన్నారు. వైఎస్సార్సీపీలో పార్టీ అధినేత, ప్రభుత్వాధినేత ఒక్కరే అని, అలాంటప్పుడు ఆయనపై చేసే విమర్శలు పార్టీకి చేటు కల్గించేవేనని, కచ్చితంగా పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలుగానే పరిగణించాల్సి ఉంటుందని తెలిపారు. రాజ్యాంగాన్ని సైతం అపహాస్యం చేసేలా రఘురామ మాట్లాడారని గుర్తుచేశారు. ఒక పార్టీలో చేరి, మరో పార్టీకి అమ్ముడుపోయి పనిచేసేవారిని ఉపేక్షించకూడదని, ఏ పార్టీలోనైనా సరే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి సభాపతులు సకాలంలో చర్యలు తీసుకోవాలని అన్నారు. అనర్హత వేటు కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఎప్పుడూలేని విధంగా స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపించారని, ఇకనైనా సరే ఆలస్యం చేయకుండా త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని తెలిపారు. ప్రివిలేజి కమిటీ దాదాపు రెండు గంటల పాటు అడిగిన ప్రశ్నలకు భరత్ అన్ని సాక్ష్యాధారాలతో సమాధానమిచ్చినట్టు తెలిసింది.

ఉచిత బియ్యం పంపిణీ నిలుపుదల ఆరోపణలపై భరత్ కౌంటర్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఉచిత రేషన్ పథకం (ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన)ను గత రెండు నెలలుగా అమలు చేయడం లేదంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ఈ పథకం కింద లబ్దిదారులుగా చాలా తక్కువ మందిని గుర్తిస్తున్నారని, నిజానికి మిగతా అందరికీ రాష్ట్ర ప్రభుత్వమే తన సొంత ఖర్చులతో రేషన్ అందజేస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని 80 శాతం మంది పేద ప్రజలంటే కేవలం 60 శాతం మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ ఇస్తోందని లెక్కలు చెప్పారు. బీజేపీ పాలిత కర్నాటకలో 80 శాతం మంది ప్రజలు ఈ పథకం కింద లబ్దిదారులుగా ఉన్నారని గుర్తుచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఫుల్ మీల్స్, ఇతర రాష్ట్రాలకు హాఫ్ మీల్స్ అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఈ వివక్షను మానుకోవాలని భరత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రేషన్ కోటాను పెంచాలని డిమాండ్ చేశారు.

తప్పు చేస్తే సొంత పార్టీవారైనా వదిలే ప్రసక్తి లేదు..

తప్పు చేసినవారెవరైనా తమ ప్రభుత్వం వదిలిపెట్టదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ అనంతబాబును కార్ డ్రైవర్ హత్యకేసులో అరెస్టు చేయడంపై స్పందన కోరగా, భరత్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టమని, ఇదే తమ పార్టీ విధానమని అన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement