న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వెనుకబడిన వర్గాల విద్య, ఉద్యోగ, సామాజికాభివృద్ధికి లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం నిర్మలా సీతారామన్‌ను న్యూఢిల్లీలోని ఆమె కార్యాలయంలో కలిసి చర్చలు జరిపారు. ఆయనతో పాటు బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, కర్రి వేణుమాధవ్ తదితరులు చర్చలో పాల్గొన్నారు.
బీసీల అభివృద్ధికి బడ్జెట్ కేటాయించకుండా కేంద్రం అన్యాయం చేస్తోందని ఆర్. కృష్ణయ్య నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. 38 లక్షల కోట్ల మంది బీసీలు ఉంటే 1400 కోట్ల బడ్జెట్ ఏం సరిపోతుందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వోద్యోగాలు, విద్యాసంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదని ఆర్. కృష్ణయ్య వివరించారు. విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంల్లో చదివే విద్యార్థులకు ఫీజులు, స్కాలర్షిప్పులు ఇవ్వడం లేదన్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఎంపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఢిల్లీలో పది రోజుల పాటు బీసీ సంఘాలు ధర్నాలు, ర్యాలీలు, ముట్టడి కార్యక్రమాలను నిర్వహించాయి. వివిధ పార్టీల నేతలను కలిసి తమ డిమాండ్ల సాధనకు మద్దతు తెలపాలని కోరారు. ఈమేరకు 92 మంది పార్లమెంట్ సభ్యులను కలిసి విజ్ఞప్తి పత్రాలు సమర్పించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.