Saturday, November 23, 2024

హైదరాబాద్ చేరుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‎రెడ్డి.. రాహుల్ పాదయాత్రలో పాల్గొంటారా..?

మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విష‌యం విధిత‌మే. ఎలాగైనా మునుగోడుపై జెండా ఎగుర‌వేయాల‌ని అధికార టీఆర్ఎస్ తోపాటు ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న స‌మ‌యంలో 10 రోజుల ముందు కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం ఆ పార్టీలో దుమారం లేపింది. ఒక‌వైపు మునుగోడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనాల‌ని కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన‌ప్ప‌టికీ అవేమీ లెక్క‌చేయ‌కుండా ఆస్ట్రేలియా టూర్ కు వెళ్ల‌డం ఏమిట‌ని వెంక‌ట్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం మండిప‌డింది. దీనికి తోడు మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కోరినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అయింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ క్రమ శిక్షణ నియమావళిని ఉల్లంఘించారని నోటీసులో పేర్కొంటూ.. దీనిపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. బుధవారంతో పది రోజుల గడువు ముగిస్తుంది. ఇదిలా ఉంటే క్లిన్ చీట్ ఇచ్చే వరకు ఎవర్ని కలవనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు. అయితే ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణలో రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రలో పాల్గొంటారా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement