Friday, November 22, 2024

Delhi | మహిళల భాగస్వామ్యంతో భారత్ అభివృద్ధి.. మహిళా బిల్లుపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఇన్నాళ్లూ మహిళలు కేంద్రంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామని, ఇకనుండి మహిళల భాగస్వామ్యంతో అభివృద్ధి జరుగుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మహిళా బిల్లుపై మాట్లాడారు. మహిళా సాధికారతతో పాటు మహిళా సారథ్యంలో అభివృద్ధి అన్న ఆలోచనతో ప్రధాని మోడీ ఉన్నారని చెప్పుకొచ్చారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చామని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో కూడా మహిళలకు మూడో వంతు సీట్లు మహిళలకు కేటాయిస్తూ బిల్లు తయారైందని జీవీఎల్ వివరించారు.

కొత్త జనాభా లెక్కలు వచ్చాక, డీలిమిటేషన్ జరిగిన తర్వాత ఈ రిజర్వేషన్లు అమలవుతాయ అన్నారు. 2026లో జరిగే పునర్విభజన ప్రక్రియలో మహిళా రిజర్వేషన్లు భాగమవుతాయని, 2021 జనగణన తప్పినందుకు 2025లోపు గణన పూర్తి చేసి మహిళా రిజర్వేషన్లు త్వరితగతిన అమలయ్యేలా చూస్తున్నామన్నాని చెప్పారు. చట్టసభల్లో మహిళల సంఖ్య ఇప్పుడున్న సంఖ్యకు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రిజర్వేషన్లు లేనప్పుడు మహిళలకు అవకాశాలు అంతగా లేవని, వివిధ కారణాలతో పురుషాధిక్యత కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -

మహిళా బిల్లు అమల్లోకి వచ్చాక కచ్చితంగా మహిళల ప్రాతినిథ్యం, పాత్ర, భాగస్వామ్యం పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సీట్ల రొటేషన్‌తో పాటు 15 ఏళ్ల పాటు అమలయ్యేలా మహిళా బిల్లు రూపొందించామని, ఆ తర్వాత కూడా కొనసాగించే అవకాశం లేకపోలేదని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం ఏ విప్లవాత్మమైన నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్, ఇతర  పార్టీలు ఏదో ఒక సాకు చూపుతూ ఉంటాయని విమర్శించారు. 2010లో కాంగ్రెస్ మిత్రపక్షాలు ఈ మహిళ బిల్లును వ్యతిరేకించాయని, తాము మద్దతిచ్చినా మిత్రపక్షాల వ్యతిరేకత కారణంగా పాస్ చేయలేదని గుర్తు చేశారు.

సమయానుకూలంగా తాము మహిళా బిల్లు తీసుకొచ్చామని, డీలిమిటేషన్‌తో పాటు అమలు చేయాలి కాబట్టి ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టామని వెల్లడించారు. కాంగ్రెస్ బిల్లులో రొటేషన్ పద్దతిలో రిజర్వ్ చేయాలని ఉందని, అలాగైతే మహిళా నాయకత్వం పెరగదని నొక్కి చెప్పారు. రొటేషన్ విధానం వల్ల కేవలం నేతల కుటుంబ సభ్యులు మాత్రమే ఆ రిజర్వేషన్ ఫలాలు పొందుతారని జీవీఎల్ చెప్పారు. సీట్ల సంఖ్య పెంచి, మహిళలకు సీట్ల కేటాయింపు జరపాలన్నది ప్రభుత్వ ఆలోచన అని వెల్లడించారు. జనరల్ మహిళా సీట్లలో ఓబీసీ మహిళలకు తగిన ప్రాతినిథ్యం కల్పించేలా పార్టీలు నిర్ణయం తీసుకోవాలని, ది వారి బాధ్యతగా భావించాలని సూచించారు.

నీతి ఆయోగ్ గ్రోత్ హబ్స్‌లో విశాఖ

దేశంలో నాలుగు నగరాలను గ్రోత్ హబ్స్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అందులో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంచుకున్న ఏకైక నగరం విశాఖ అని వెల్లడించారు. మిగతా వాటిలో ముంబై, సూరత్, వారణాసి నగరాలను పైలట్ నగరాలుగా ఎంపిక చేసినట్టు ఆయన పేర్కొన్నారు. నీతి ఆయోగ్ ద్వారా సిటీ లెడ్ డెవలప్మెంట్ జరపాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. విజన్ విశాఖపట్నం 2030 పేరుతో తాను అనేక రంగాలపై సమావేశం నిర్వహించానని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో మిగతా సెక్టార్స్ మీద కూడా సమావేశాలు జరిపి నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంను కలుస్తానని, కేంద్ర ప్రభుత్వం గ్రోత్ హబ్ ప్రాజెక్టుకు ప్రణాళికలు అందిస్తామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement