న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. శుక్రవారం ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్‌తో సమావేశమయ్యారు. ప్లాంట్ సామర్థ్యం పెంపు, లాభాల్లోకి తీసుకురావడం, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎండీతో విస్తృతంగా చర్చించారు. గత సంవత్సర కాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న వర్కింగ్ క్యాపిటల్, ముడిసరుకు, ఉద్యోగుల సమస్యలపై పార్లమెంటులో ప్రశ్నించడమే కాక పలుమార్లు ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించానని జీవీఎల్ మీడియాకు జీవీఎల్ తెలిపారు.
ఆర్‌ఐఎన్‌ఎల్ ప్రస్తుత పనితీరును సమీక్షిస్తూ రానున్న నెలల్లో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని పెంచడతో పాటు,లాభాల్లోకి తెచ్చే విధంగా చేపట్టవలసిన అన్ని ప్రయత్నాలపై అతుల్ భట్‌తో చర్చించానని చెప్పారు. అతుల్ భట్ కొత్తగా ముడి సరుకు వర్కింగ్ క్యాపిటల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి తాను చేస్తున్న ప్రయత్నాలకుగానూ అతుల్ భట్ ధన్యవాదాలు తెలిపారని జీవీఎల్ వివరించారు.