న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పని చేస్తాయని, బీజేపీ వాటిని ప్రభావితం చేయదని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. గురువారం ఆయన తెలంగాణ రైతు ఐక్య వేదిక నేతలతో కలిసి న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కలిశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అరవింద్ మాట్లాడుతూ నిజామాబాద్, జగిత్యాల రైతు సమస్యలను కేంద్రమంత్రికి వివరించామన్నారు. వరి, పసుపు, మామిడి, మక్క రైతు సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇథనాల్ ప్లాంట్ పెట్టడం లేదు, ప్రైవేట్ వారినీ పెట్టనివ్వడం లేదని ఆయన ఆరోపించారు. చెరకు రైతుల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వరి కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందన్న అరవింద్… తరుగు తీయడం, సమయానికి కొనుగోలు చేయడం లేదని చెప్పుకొచ్చారు. అక్టోబర్ 10న జగిత్యాలలో నిర్వహించనున్న రైతు సదస్సులో తెలంగాణ రైతు ఐక్య వేదిక రైతులు బీజేపీలో చేరతారని వెల్లడించారు. రైతులకు బీజేపీ ఏం చేస్తుందో రైతు సదస్సులో తెలియజేస్తామన్నారు.
కేటీఆర్ డ్రగ్స్ తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న కేటీఆర్ వ్యాఖ్యలను పట్టించుకోమని అరవింద్ తెలిపారు. బీజేపీ నేతలను జోకర్లు అనే ముందు కేసీఆర్ థర్డ్ క్లాస్ బ్రోకర్ అనే విషయం తెలుసుకోవాలని తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశంలో హిందువులను చంపడం కోసం ఏర్పాటు చేసిన పీఎఫ్ఐ సంస్థను కేసీఆర్ ప్రోత్సాహిస్తున్నారన్న ఆయన, లిక్కర్ స్కాంలో కవిత, ఫీనిక్స్ బిల్డర్స్ స్కాంలో కేటీఆర్ అరెస్టవుతారని జోస్యం చెప్పారు. తెలంగాణలో హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఉన్న టెర్రరిస్ట్ పార్టీ ఎంఐఎం అని మండిపడ్డారు. కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రచారానికి వెళతారన్న అరవింద్, కేటీఆర్, కవిత అరెస్టవుతారని చెప్పుకొచ్చారు. జైళ్ల శాఖ మంత్రి కేటీఆర్, కవిత కోసం జైలు సిద్ధం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. నాలుగు రోజుల్లో కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు పిలుస్తారని, ఐదో రోజు అరెస్ట్ చేస్తారని అన్నారు. కేటీఆర్‌కు నార్కోటిక్ పరీక్ష చేయాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయగలిగేది కేటీఆర్ మాత్రమేనని ఆయన ఆరోపించారు. కవితను ఓడించడం, జైలుకు పంపడం వెనక కేటీఆరే ఉంటారని అరవింద్ చెప్పారు.