హైదరాబాద్ పాతబస్తీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాతబస్తీలో వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో అమలులో మరింత వేగంగా వ్యవహరించాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.
ఈ సమావేశంలో పురపాలక శాఖ అధికారులు, వివిధ పథకాలు కార్యక్రమాల కింద చేపట్టిన పనుల వివరాలను అందజేశారు. పాతబస్తీలోని వివిధ నియోజకవర్గాల్లో ఎస్సార్డీపీ కింద నిర్మాణం అవుతున్న ఫ్లై ఓవర్లు, రహదారులు, నాలాల వెడల్పు కార్యక్రమం, రెండు పడక గదుల నిర్మాణం, తాగునీటి రిజర్వాయర్, పైపులైన్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రగతి గురించి మంత్రి కేటీఆర్ సుదీర్ఘ సమీక్ష చేశారు. ఆయా పనుల అమలులో ఎక్కడైనా అనుకోని అవాంతరాలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తేవాలని, పనులన్నీ సమయానికి పూర్తయ్యేలా ఉన్నతాధికారులు శ్రద్ధ వహించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వార్త కూడా చదవండి: పెగాసస్‌పై రాజ్యసభలో కీలక ప్రకటన