సమస్యల పరిష్కారం కోసమే నిరవధికంగా షూటింగ్స్ ని బంద్ చేసినట్లు తెలిపారు నిర్మాత సి.కల్యాణ్. కాగా తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రత్యేకంగా సమావేశమైంది. నిర్మాతలు సీ కల్యాణ్, దిల్ రాజు, ప్రసన్నకుమార్, దామోదర ప్రసాద్ ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ.. నిర్మాతల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్ లక్ష్యం ఒకటేనన్నారు.
అనంతరం మరో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో సమస్యల పరిష్కారం కోసం నాలుగు కమిటీలు వేసినట్లు చెప్పారు. ఓటీటీ, వీపీఎఫ్ చార్జీలు, రెవెన్యూ పర్సంటేజీలు, సినీకార్మికుల వేతనాలు, నిర్మాణ వ్యయాలపై కమిటీలు పని చేస్తాయని పేర్కొన్నారు. నెలల తరబడి షూటింగ్స్‌ను ఆపేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. నిర్మాతలందరు కలిసి తనపై బాధ్యతలు పెట్టారని చెప్పారు. నాకు వ్యక్తిగత ఎజెండా అంటూ ఏమీ లేదని, సినిమాల కోసం మాత్రమే నేను పని చేస్తానని పేర్కొన్నారు.