అమరావతి, ఆంధ్రప్రభ : మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి జగన్ ఆలోచనల నుండి పుట్టిన ఆయుధమే దిశ యాప్. దిశ అప్లికేషన్.. ఇది మహిళలకు రక్షక కవచం.. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళలకు, ఒంటరి మహిళలు, విద్యార్ధినులు, యువతులు దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం ప్రస్తుత పరిస్ధితుల్లో ఎంతో అవసరం, ముఖ్యం కూడా. ప్రతి మహిళ దిశ యాప్‌ను స్మార్ట్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాలి .. అనుకోని ఆపద సంభవించినా.. అనుకోకుండా చిక్కుల్లో పడినా.. దిశ యాప్‌తో సంకేతాలు పంపితే వెంటనే ఘటనా ప్రదేశానికి చేరుకొని బాధిత మహిళను పోలీసులు రక్షిస్తారు. అంటూ రాష్ట్రంలో ప్రస్తుతం మెగాడ్రైవ్ కొనసాగుతోంది. 24 గంటలూ మహిళల రక్షణ, భద్రతకు సంబంధించి కవచంలా ఉండే దిశ అప్లికేషన్‌ను రాష్ట్రమంతా ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవడమే ప్రభుత్వ ముఖ్య ఉద్ధేశ్యం. దీనికనుగుణంగా డీజీపీ కెవి రాజేంద్రనాధ్ రెడ్డి దిశ యాప్ డౌన్‌లోడ్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇటీవల దిశ యాప్‌పై వస్తున్న వదంతులను రాష్ట్ర పోలీసుశాఖ ఇప్పటికే కొట్టి పారేసింది. దిశ డౌన్‌లోడ్ వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని, ఫోన్‌లోని సమాచారం, పర్సనల్ డేటా లీక్ అవుతుందనే అపోహ కేవలం భ్రమ మాత్రమేనని రాష్ట్ర పోలీసుశాఖ స్పష్టం చేసింది. ఈక్రమంలో దిశ డౌన్‌లోడ్‌పై మరింత దృష్టి సారించాలని, రికార్డు సంఖ్యే లక్ష్యంగా రాష్ట్రమంతా ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకునేలా అవగాహన కల్పించడంతోపాటు దగ్గరుండి స్వీయ పర్యవేక్షణలో అందరినీ వారి స్మార్ట్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేయించాలని రాష్ట్రంలోని 26 జిల్లాల ఎస్పీలను, పోలీసు కమిషనర్‌లను డీజీపీ ఆదేశించారు. ఇందుకోసం రాష్టవ్యాప్తంగా మెగా డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు.
ఒక ఉద్యమంలా తీసుకుని దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించాలని, ఇందుకోసం ప్రతి జిల్లాలో రెండు లక్షల తక్కువ కాకుండా లక్ష్య ంగా తీసుకుని డౌన్‌లోడ్ చేయించాలని నిర్ధేశం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా పోలీసు యంత్రాంగం దిశ డౌన్‌లోడుకు సమాయత్తమైంది. జిల్లా ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో తమ వెసులుబాటు, తమకు నచ్చిన రీతిలో కార్యక్రమానికి రూపకల్పన చేసి జిల్లాలోని ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో క్యా ంపెయిన్‌లు ఏర్పాటు చేసి లక్ష్యం పూర్తయ్యేలా స్వయంగా రంగంలోకి దిగారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, స్ధానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన స్పెషల్ డ్రైవ్ ప్రతిరోజూ ప్రతి జిల్లా, విజయవాడ, విశాఖ పోలీసు కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్నాయి.
రంగంలోకి దిగి.. రోడ్డెక్కిన ఎస్పీలు, కమిషనర్లు ..
ప్రభుత్వ నిర్ధేశానికి అనుగుణంగా దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించేందుకు జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్‌లు స్వయంగా రంగంలోికి దిగారు. ఇతర అధికారులు, ప్రజా ప్ర తినిధులతో కలిసి మాస్ క్యాంపెయిన్‌లు నిర్వహిస్తున్నారు. రోడ్డు ఎక్కి నేరుగా జనంలోికి వెళ్లి మహిళలను కలిసి దిశ ప్రాధాన్యతను వివరించి దగ్గరుండి మరీ డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, కృష్ణాజిల్లా, విజయవాడ, ప్రకాశం, తదితర జిల్లాల్లో తొలిదశ మాస్ క్యాంపెయిన్ పూర్తయింది. ఆయా జిల్లాల్లో త్వరలోనే మలివిడత చేపట్టనున్నారు. ఇక ఇప్పటికీ ప్రారంభం కాని జిల్లాల్లో క్యాంపెయిన్‌లు నేడో రేపో ప్రారంభించనున్నారు.
దిశ యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిననాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా చర్యలు తీసుకోదగిన కాల్స్ 12,667, కాగా, ఎఫ్‌ఐఆర్‌గా నమోదైనవి 1,405 ఉన్నాయి. అదేవిధంగా ఆపద నుంచి రక్షించబడిన వారి సంఖ్య 927, కాగా దిశ నుంచి సమాచారం అందగానే సగటు ప్రతిస్పందన సమయం నగరాల్లో 5 నిముషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 నిముషాలుగా ఉంది. కాగా దిశ యాప్ డౌన్‌లోడ్‌కు సంబంధించి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించిన జిల్లాల్లో కృష్ణాజిల్లా లక్ష డౌన్‌లోడ్‌లు చేసి రికార్డు సాధించగా.. తాజాగా దీన్ని అధిగమిస్తూ విజయవాడ పోలీసు కమిషనరేట్ ఒకేరోజు డ్రైవ్‌లో రెండు లక్షల డౌన్‌లోడ్‌లు చేపట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..