హైదరాబాద్ – భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల దేశవ్యాప్తంగా అనేక మంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశంలోని పలువురు పారిశ్రామిక ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత రతన్ టాటా విషాద మరణంతో భారతదేశ కార్పొరేట్ అభివృద్ధికి దేశ నిర్మాణం, శ్రేష్ఠతను మిళితం చేసిన ఐకాన్‌ను కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆయన టాటా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లారని, దానికి మరింత ప్రభావవంతమైన ఉనికిని అందించారని ప్రస్తావించారు. దీంతోపాటు అనేక మంది నిపుణులను, యువ విద్యార్థులను ప్రేరేపించారని గుర్తు చేశారు. ఈ క్రమంలో దాతృత్వానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని వెల్లడించారు.
దయగల అసాధరణ వ్యక్తి – ప్రధాని
రతన్ టాటా దూరదృష్టి గల వ్యాపార నాయకుడని, దయగల అసాధారణ వ్యక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలలో ఒకదానికి స్థిరమైన నాయకత్వాన్ని అందించారని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్యం, జంతు సంరక్షణ వంటి అనేక అంశాలకు మద్దతు ఇవ్వడంలో ఆయన ముందున్నారని తెలిపారు. ఇదే సమయంలో ఆయన సహకారం, వినయం, దయతో మన సమాజాన్ని మెరుగుపరచాలనే అచంచలమైన నిబద్ధతకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు ప్రధాని మోదీ.
ఆయన విజన్ ముందు తరాలకు మార్గదర్శకం – రాహుల్ గాంధీ.
రతన్ టాటా మృతి పట్ల ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా విజన్ ఉన్న వ్యక్తి అని రాహుల్ గాంధీ అన్నారు. ఆయన వ్యాపారం, దాతృత్వం రెండింటిలోనూ చెరగని ముద్ర వేశారన్నారు. ఆ నేపథ్యంలో ఆయన కుటుంబానికి, టాటా గ్రూప్‌కు సానుభూతి తెలియజేశారు.
ఆయన మార్గదర్శకత్వంలోనే మేమందరం – అనంద్ మహింద్రా.
మరో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా రతన్ టాటా మృతికి సంతాపం తెలియజేశారు. నేడు భారత ఆర్థిక వ్యవస్థ చారిత్రాత్మకంగా దూసుకుపోతోందని అన్నారు. మనల్ని ఈ పరిస్థితికి తీసుకురావడంలో రతన్ టాటా జీవితంలో ఎంతో పనిచేశారని ప్రస్తావించారు. ఇలాంటి సమయాల్లో ఆయన మార్గదర్శకత్వం అమూల్యమైనదని కొనియాడారు.
ఆధునిక భారతదేశ పితామహుడు – గౌతమ్ అదాని..
భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కూడా రతన్ టాటా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. టాటా ఆధునిక భారతదేశ మార్గాన్ని పునర్నిర్వచించారని, ఆయన కేవలం వ్యాపార నాయకుడే కాదన్నారు. ఆయన సమగ్రత, కరుణ, మంచి కోసం అచంచలమైన నిబద్ధతతో భారతదేశ స్ఫూర్తిని మూర్తీభవించారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తిత్వాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయని అదానీ వెల్లడించారు.