Thursday, November 28, 2024

PCC Chief | తొమ్మిది నెలల్లోనే అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేశాం..

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో (ఆంధ్రప్రభ ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే అనేక అభివృద్ది, సంక్షేమ పథకాలను అమలు చేసిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం రోజు మీడియాతో మాట్లాడారు.

వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కచ్చితంగా జిల్లాకు ప్రాతినిధ్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. దసరా కానుకగా జిల్లాకు త్వరలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కళాశాల మంజూరు చేస్తామన్నారు. మ్యానిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేరుస్తామని అన్నారు.

నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే అప్పటి యూపీయే (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) సర్కార్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 50 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 30 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మహేష్ కుమార్ విమర్శించారు.

రుణ మాఫీ విషయంలో ప్రజలను ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా అయోమయానికి గురిచేస్తున్నాయని మండిపడ్డారు. పదేళ్లలో బిఆర్ఎస్ ఇచ్చిన రుణమాఫీ ఎంత ? కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల్లో ఇచ్చిన రుణ మాఫీ ఎంతనో బేరీజు వేయాలని ప్రజలను కోరారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని కేసిఆర్ విచ్ఛిన్నం చేశారని, అప్పుల రాష్ట్రాన్ని అప్పగించారని ఆరోపించారు.

అయినప్పటికి ఏ ఒక్క కార్యక్రమం ఆగకుండా రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా బీఆర్ఎస్ వాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలు తాత్కాలిక ఆనందం ఇచ్చినా దీర్ఘకాలికంగా బీఆర్ఎస్‌కు నష్టం జరుగక తప్పదని హెచ్చరించారు.

- Advertisement -

నిజామాబాద్ జిల్లా పారిశ్రామిక అభివృద్ధి పై త్వరలో సిఎంతో చర్చిస్తామన్నారు. ప్రాణహిత 20,21వ ప్యాకేజీ పనులు వేగవంతం చేయిస్తానన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల ఆవశ్యకత ఉందన్నారు. మరో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.
జిల్లాలో మంచి స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టే పనిలో పడ్డాయని, కాని అబద్ధాలను ప్రజలు నమ్మబోరని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తంచేశారు. అర్వోబి విషయంలో కేంద్రం నిర్లక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. నిజామాబాద్ స్మార్ట్ సిటీగా ఎంపిక కావాల్సి వుందన్నారు. ఎంపి అరవింద్ చొరవ తీసుకుని ఆ దిశగా కృషి చేయాలనీ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రూరల్ ఎంఎల్ఏ భూపతి రెడ్డి,.రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నుడ చైర్మన్ కేశ వేణు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement