న్యూఢిల్లి : భారత్ జీడీపీ వృద్ధి రేటు విషయంలో మోర్గాన్ స్టాన్లీ కీలక ప్రకటన చేసింది. 2022-23, అలాగే.. 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన జీడీపీ వృద్ధి రేటు అంచనాలను సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.6 శాతానికి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను 6.7 శాతానికి తగ్గించింది. సైక్లికల్ రికవరీ ట్రెండ్ కొనసాగుతుందని భావించినప్పటికీ.. ఇది గతంలో అంచనా వేసిన దానికంటే మృదువుగా సాగుతుందని పేర్కొంది. నెమ్మదించిన ప్రపంచ వృద్ధి, వాణిజ్య షాక్ వంటి ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల తదితర అంశాలు వ్యాపార విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకుని సమీపకాల దృక్పథాన్ని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. తమ గ్లోబల్ ఎకనమిక్స్ టీమ్ 2022 క్యాలెండర్ ఏడాదిలో వృద్ధి రేటును 6.2 శాతం నుంచి 2.9 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తోంది.
ఈ నేపథ్యంలో భారత్ జీడీపీ వృద్ధిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.9 శాతం నుంచి 7.6 శాతానికి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 7 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించింది. ప్రభుత్వ విధాన సంస్కరణలు, సామర్థ్య వినియోగస్థాయిల పెరుగుదలతో పాటు ప్రభుత్వ మౌలిక సదుపాయాల వ్యయ విస్తరణ, ప్రైవేటు కాపెక్స్ 6 నుంచి 9 నెలల్లో కోలుకోవడానికి సహాయపడుతుందని పేర్కొంది. ప్రపంచ వృద్ధిలో మందగమనం, ఉత్పత్తుల అధిక ధరలు, గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ ప్రభావం భారత్‌పైన ప్రభావం చూపుతుందని పేర్కొంది. మోర్గాన్ స్టాన్లీ ప్రకారం అధిక ద్రవ్యోల్బణం, బలహీన వినియోగ డిమాండ్, కఠిన ఆర్థిక పరిస్థితులు, వ్యాపార సెంటిమెంట్ పైన ప్రతికూల ప్రభావం క్యాపెక్స్ రికవరీలో జాప్యానికి కారణమని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి