హైదరాబాద్, ఆంధ్రప్రభ:ఏటేటా రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు పెరుగుతుండడంతో గోదాముల సామర్థ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త గోదాములను నిర్మించింది. మరో 40 లక్షల టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం కోసం కసరత్తు చేస్తోంది. ఈ గోదాముల నిర్మాణం కూడా పూర్తయితే రాష్ట్రంలో ధాన్యం నిల్వ సామర్థ్యం కోటి టన్నులకు పైగా పెరగనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో అంటే 2014లో రాష్ట్రంలోని గోదాముల్లో ధాన్యం నిల్వ సామర్థ్యం కేవలం 39లక్షల టన్నులు మాత్రమే. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రస్తుతం ఆ సామర్థ్యం 72లక్షల టన్నులకు పెరిగింది.
తాజాగా మరో 40లక్షల టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం కోసం కొత్త గోదాములను నిర్మించనుండడంతో కోటి 20లక్షల టన్నుల దాకా గోదాముల సామర్థ్యం పెరగనుంది. రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు ఏటేటా పెరుగుతున్నాయి. దీంతో గోదాముల సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా మార్కెటింగ్ శాఖ తన గోదాముల సామర్థ్యాన్ని 7.38లక్షల టన్నుల నుంచి 24.73 లక్షల టన్నులకు పెంచుకుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ గోదాముల్లో ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని 2.61 లక్షల టన్నుల నుంచి 7.24 లక్షల టన్నులకు పెంచింది. మార్కెటింగ్ శాఖ 40లక్షల టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యానికి గోదాముల నిర్మాణానికి డీపీఆర్‌లను సిద్ధం చేసింది. ఈ గోదాముల నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో గోదాముల నిల్వ సామర్థ్యం 1.12కోట్లకు పెరగనుంది. గోదాముల నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలతోపాటు పలు సంస్కరణలను ఏకకాలంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ అమలు చేస్తోంది.
గోదాముల్లో నిల్వ చేసిన పంట దిగుబడులు పాడవకుండా, నిల్వ నష్టాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనికోసం అన్ని గోదాముల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పింది. ఎస్‌డబ్ల్యూఎస్ పరిధిలోని గోదాములను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనని వేర్ హౌసింగ్ కార్పోరేషన్ అండ్ రెగ్యులేటింగ్ అథారిటీ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో ఆ సంస్థ గోదాముల్లో నాణ్యత ప్రమాణాల పాటింపు చర్యలను తనిఖీ చేస్తూ ప్రత్యేక గ్రేడింగ్‌లను జారీ చేసింది. గతంలో ఉన్న గోదాముల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో నిల్వ నష్టాలు అధికంగా ఉండేవి. దీన్ని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ధాన్యం నిల్వ నష్టం గణనీయంగా తగ్గింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..