దేశవ్యాప్తంగా గృహహింస చట్టం కింద 4,71,684కేసులు, 21,088 అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ శుక్రవారం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. రాష్ట్రాల వారీగా, గృహహింస చట్టం కింద ఈ ఏడాది జులై ఒకటో తేదీ వరకు పెండింగ్‌లో ఉన్న కేసుల గణాంకాలను నల్సా సుప్రీంకోర్టుకు అందచేసింది. ఈ గణాంకాల ప్రకారం గృహహింస చట్టం (డొమెస్టిక్ వయోలెన్స్ యాక్ట్ ) అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 11, 93, 359 కేసులు నమోదయ్యాయి. నల్సా సమర్పించిన డేటా ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 2,02,880 కేసులు నమోదయ్యాయి. గృహహింస కేసుల్లో ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో ఉంది. రెండోస్థానంలో మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రలో 1,96,717 గృహహింస కేసులు నమోదయ్యాయి. అత్యధిక సంఖ్యలో పెండింగ్ కేసులు కూడా ఉత్తరప్రదేశ్‌లోనే ఉండడం గమనార్హం. యూపీలో 1,19,684 గృహహింస కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఆ తర్వాత స్థానాల్లో 84,637 కేసులతో మహారాష్ట్ర, 27,043 కేసులతో ఢిల్లిd లు ఉన్నాయి. గృహహింస చట్టాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా మనం మహిళలం అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు రాష్ట్రాల వారీగా పెండింగ్‌లో ఉన్న గృహహింస కేసుల వివరాలను అందచేయాల్సిందిగా, నల్సాను ఆదేశించింది. గృహహింసకు సంబంధించిన ఎన్ని కేసుల్లో మహిళలకు ప్రొటెక్షన్ ఆఫీసర్ లేదా సర్వీస్ ప్రొవైడర్ లేదా ఆశ్రయం కల్పించిన వివరాలను కూడా సమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గృహహింస చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, తగిన సంఖ్యలో సిబ్బందిని, లా ఆఫీసర్లు, రెవిన్యూ, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, ప్రొటెక్షన్ ఆఫీసర్లు, జడ్జీలను కూడా కేటాయించాలని సుప్రీంకోర్టు సూచించింది. కుటుంబసభ్యుల వేధింపుల నుంచి మహిళలను రక్షించడానికి యూపీఏ ప్రభుత్వం 2005లో డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ తీసుకు వచ్చింది.