హైదరాబాద్, ఆంధ్రప్రభ : సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థునులతో పరిచయం పెంచుకొని వేధింపులకు పాల్పడే పోకిరీలపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నారు. విద్యార్థునులతో స్నేహం పెంచుకుని, ఆపై ప్రేమించాలని పోకిరీలు వేధిస్తున్నారన్న ఫిర్యాదులే అధికంగా షీటీం పోలీసులకు అందుతున్నాయి. ఈక్రమంలో పోకిరీల ప్రేమను తిరస్కరించిన విద్యార్థునుల ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి వేధిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.
మార్ఫింగ్ చేసిన అసభ్య చిత్రాలు, అశ్లీల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఉంచుతామంటూ బెదిరిస్తున్నారని వస్తున్న ఫిర్యాదులపై దర్యాప్తు వేగవంతం చేసి నిందితులపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల కలంలో షీ టీం పోలీలకు అందిన ఫిర్యాదుల్లో 70 శాతం ఫోన్లు, ఫేస్బుక్, వాట్సాప్‌ల నుంచే ఉంటుంటడం గమనార్హం.
ఈక్రమంలో షీ బృందాల వద్దకు వస్తున్న బాధితుల మనోవేదన, మానసిక పరిస్థితిని స్వయంగా చూస్తున్న పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదు తీవ్రత ఆధారంగా నిందితులపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. గడచిన ఆరు నెలల్లో 45 మంది నిందితులపై నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి జైలుకు పంపించారు.
మరింత బలోపేతం..
విద్యార్థునుల, మహిళల భద్రత కోసం పనిచేసే షీ టీమ్‌లను రాష్ట్ర వాప్తంగా మరింత బలోపేతం చేసేందుకు సమాయత్తమౌతున్నాయి. రాష్ట్రంలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మహబూబాబాద్‌లో ఇప్పటికే భరోసా కేంద్రాలుండగా, ఇటీవల యాదాద్రి భువనగిరి, శంషాబాద్, జోగులాంబ గద్వాల, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ కేంద్రాల సంఖ్యను మరింత పెంచి బాధిత మహిళలకు న్యాయ, వైద్య, రక్షణ, పరిహారం వంటి అన్ని సహాయ సహకారాలు అందించేందుకు ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు సమాలోచనలు సాగిస్తున్నారు. అతివలను వేధిస్తున్న మృగాళ్లు, ఆకతాయిల ఆటకట్టిస్తూ వారిని కటకటాల్లోకి పంపించేందుకు మహిళల కోసం ప్రత్యేకంగా జిల్లా కేంద్రాల్లో మహిళా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసిన విషయం విదితమే. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లలో ప్రత్యేకించి ఉమెన్ రిసెప్షన్ సెల్‌ను ఏర్పాటు చేయడంతో బాధిత మహిళలు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని పోలీసు శాఖ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు.
డయల్ 100..
మహిళలను వేధించే అకతాయిపై వాట్సాప్, డయల్ 100, హాక్ఐ, ఈ-మెయిల్, సోషల్ మీడియా, క్యూఆర్ కోడ్స్ ద్వారా షీ టీమ్ అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, కళాశాలలు, సినిమా హాళ్ల వద్ద క్యూఆర్ కోడ్‌తో కూడిన షీటీమ్ పోస్టర్లను అతికించడంతో పాటు బాధితులు వెంటనే క్యూఆర్ కోడ్‌ను స్కాన్‌చేసి ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. అలాగే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఏర్పాటు చేసి మహిళలు, పిల్లల అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నారు.
ఆన్లైన్లో వేధిస్తున్న ఆకతాయిలకు షీ సైబర్ ల్యాబ్‌తో షీటీములను ఏర్పాటు చేసి ర్యాగింగ్, ఈవ్‌టీ జింగ్, పోక్సో చట్టాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా హైస్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నేరాల నివారణకు శిక్షణ ఇవ్వడంతో పాటు షార్ట్‌ఫిల్మ్‌లు, యాడ్స్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా భద్రతా చర్యలను వివరిస్తున్నారు.
సాంకేతిక పరిజ్ఞనం…
షీ టీం బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నిందితులకు శిక్షపడేలా చర్యలు చేపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని అధికారులు వివరిస్తున్నారు. ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి మైనర్ బాలికలను టార్గెట్ చేస్తున్నారని, స్నేహం పేరిట పోస్టులు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలతో పాటు ఇతర వ్యక్తిగత భద్రతకు సంబంధించిన సమాచారాన్ని పోస్టు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
విద్యార్థినులు, యువతుల ఫోన్ నంబర్లను వివిధ మార్గాల ద్వారా తెలుసుకుంటున్న పోకిరీలు, సైబర్ నేరస్థులు అసభ్య చిత్రాలు, వీడియోలు పంపుతున్నారు. వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి, అశ్లీల దృశ్యాలుంచి వారి పరువుకు భంగం కలిగించేలా ప్రవరిస్తున్నారు. అలాంటి వారికి భయపడకుండా ఉండాలని విద్యార్థునులకు, మహిళలకు షీటీం పోలీసులు వెబ్సైట్, ఫేస్బుక్ ఖాతాల ద్వారా భరోసా కల్పిస్తున్నారు.