అమరావతి,ఆంధ్రప్రభ : రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలున్నరేళ్ళలో వ్యవసాయరంగంలో సరికొత్త విప్లవానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడానికి వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఈ నేపధ్యంలో ఇంధన ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. రాష్ట్రంలో అత్యధిక శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుండటంతో రైతులకు మరింత ఆదాయం సమకూర్చడానికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
ఓవైపు వ్యవసాయ ఉత్పత్తుల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు ఇంధన తయారీపై దృష్టి పెట్టింది. ఇందుకోసం రాష్ట్రంలో బయో ఇథనాల్ తయారీకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తోంది. బయో ఇథనాల్‌కు ముఖ్యమంత్రి జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల రాజమండ్రిలో అస్సాగో యూనిట్‌కు క్రిభ్‌కో, డాల్వకోట్ యూనిట్లకు శంకుస్థాపనలు చేపట్టారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే అస్సాగో, క్రిభ్‌కో, అవేశా ఫుడ్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఈఐడీ ప్యారీ, డాల్వకోట్, ఎకో స్టీల్, చోడవరం షుగర్స్, రోచే గ్రీన్ ఆగ్రో, నితిన్‌సాయి, గ్రేస్ వెంచర్స్ వంటి 20కిపైగా సంస్థలు రాష్ట్రంలో రూ.3,000 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. మరికొన్ని సంస్థలు పెట్టు-బడులు పెట్టడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.
ఈ యూనిట్ల అన్నింటి ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిపి చూస్తే రోజుకు 5,000 కిలో లీటర్లకు పైగా బయో ఇథనాల్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటు-న్నాయి. ఇది దేశంలోనే అత్యధికమని చెబుతున్నాయి. రాష్ట్రంలో రైతులు ధాన్యం, మొక్కజొన్నలను అత్యధికంగా సాగు చేస్తుండటమే కాకుండా భారీగా ఎగుమతులు చేస్తున్నారు.
దీంతో ఇథనాల్ తయారీలో పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు ముందుకు వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 13 మిలియన్ టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అయ్యింది. అలాగే మూడు మిలియన్ టన్నులకు పైగా మొక్కజొన్న ఉత్పత్తి అయినట్లు- గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో రాష్ట్రం నుంచి 6 మిలియన్ టన్నుల బియ్యం (నాన్ బాస్మతి), ఒక మిలియన్ టన్ను మొక్కజొన్నను ఎగుమతి చేశారు.
మిగులు ఆహార ఉత్పత్తుల నుంచి ఇథనాల్‌ను తయారు చేయడానికి కేంద్రం అనుమతించడంతో పెట్టు-బడిదారుల చూపు మనరాష్ట్రంపై పడింది. విత్తనం నుంచి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అండగా నిలుస్తోంది. దీంతో వ్యవసాయం నుంచి ఇంధన తయారీకి హబ్‌గా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోంది.
ఏడాదికి 3.1 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం..
ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యాల నుంచి 760 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతోంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి 2025-26 నాటికి అదనంగా 1,016 కోట్ల లీటర్లు అవసరమవుతుందని అంచనా. ఇథనాల్ కలపడాన్ని ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 20 శాతానికి పెంచడం వల్ల ఏటా ఇంధన దిగుమతి వ్యయంలో రూ.51,600 కోట్ల మేర విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుందని నీతిఆయోగ్ అంచనా.
ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా 16 కోట్ల లీటర్ల పెట్రోల్‌ను విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో 20 శాతం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏడాదికి 3.1 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని అంచనా. పర్యావరణహిత క్లీన్ ఎనర్జీ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, బయో ఇథనాల్ తయారీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో రోజుకు 5,000 కిలోలీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో 20కుపైగా ఇథనాల్ యూనిట్లు- ఏర్పాటవుతున్నాయి