ఈ ఏడాది 175 తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకువచ్చాయి. కరోనా వల్ల థియేటర్లు మూతపడటం, కొద్ది రోజులు నైట్ కర్య్పూ అమలులో ఉన్న కారణంగా సినిమాల విడుదల ఆగిపోయినప్పటికీ 175 చిత్రాలు విడుదల కావడం విశేషం. 2020లో కరోనా ప్రభావం వల్ల సుదీర్ఘ కాలం థియేటర్లు మూతపడ్డాయి. లాక్ డౌన్ అమల్లో ఉంది. దాంతో 2020లో కేవలం 50 తెలుగు సినిమాలు 15 అనువాద చిత్రాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ఈ ఏడాది కూడా మూడు నెలలు సినిమా రిలీజ్‌లు ఆగిపోయాయి. థియేటర్లు తిరిగి తెరుచుకోగాలనే ఒక్కసారిగా సినిమాల హడావుడి పెరిగింది. చిత్ర నిర్మాణం చివరలో ఉన్నవి. మధ్యలో నిలిచిపోయిన సినిమాలు సైతం విడుదలకు సిద్ధమై థియేటర్ల అందుబాటులోకి రావడంతోనే రిలీజ్ అయ్యాయి. భారీ చిత్రాలతో పాటుగా ప్రతి వారం చిన్న సినిమాలు వచ్చాయి. అలాగే ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు 42 వచ్చాయని సినీ వాణిజ్య మండలి తెలిపింది. మొత్తం 217 సినిమాలతో ప్రతికూల పరిస్థితుల్లో కూడా 2021 సంవత్సరం తెలుగు సినిమాకు కలిసి వచ్చింది.
గతంలో నిలిచిపోయిన సినిమాలు ఒక్కసారిగా రావడం వల్లే ఈ సంఖ్య పెరిగిందని సినీ వర్గాలు అంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకువచ్చాయి. వకీల్‌సాబ్, క్రాక్, అఖండ, పుష్ప, శ్యామ్‌సింగ రాయ్ వంటి భారీ చిత్రాల సక్సెస్ సినీ పరిశ్రమకు ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు తగ్గినప్పటికీ, సక్సెస్ సినిమాలకు ఆశించిన మేర వసూళ్లు వచ్చినట్టు చిత్ర నిర్మాతలు ప్రకటిస్తున్న అంకెలు స్పష్టం చేస్తున్నాయి. దేశం మొత్తంలో తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే ప్రోత్సహకరంగా ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. పైగా తెలుగు సినిమాలు పాన్ ఇండియాగా నిర్మించడం వల్ల ఇవి దేశవ్యాప్తంగా ప్రదర్శింపబడుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital