హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాజధాని హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా రోడ్ల అభివృద్ధిపై పురపాలక శాఖ ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమం(ఎస్సార్డీపీ) ఫేజ్ 1ను పూర్తి చేసి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఎన్నో కొత్త రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఎస్సార్డీపీ కోసం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల ద్వారా పురపాలక శాఖ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయితే మరోపక్క హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌ఆర్డీసీఎల్) ద్వారా పురపాలక శాఖ నగరంలో 100కుపైగా లింకు రోడ్ల నిర్మాణాన్ని చేయతలబెట్టి కొన్నింటిని ఇప్పటికే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా నగరానికి మణిహారంగా ఉన్న అవుటర్ రింగురోడ్డు(ఓఆర్‌ఆర్)కు నగరవాసులు సులువుగా చేరుకునేందుకుగాను నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఓఆర్‌ఆర్‌కు కొత్తగా లింకు రోడ్లను నిర్మించడంతో పాటు ఇప్పటికే ఉన్న రోడ్లను విస్తరించడానికి హెచ్‌ఆర్డీసీఎల్ నిర్ణయించింది.
ఇందుకోసం ఇప్పటికే ఆ సంస్థ సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. నగరంలోని నలుమూలలను ఓఆర్‌ఆర్‌కు కలుపుతూ లింక్, మిస్సింగ్ రోడ్లను కొత్తగా నిర్మించడంతోపాటు ఇప్పటికే ఉన్న రోడ్లను 100 ఫీట్‌ల రోడ్లుగా విస్తరించనున్నారు. ఇందుకు మొత్తంగా రూ.2600 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ నిధులను సమకూర్చడానికి బ్యాంకులు ముందుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్ల విస్తరణతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఓఆర్‌ర్‌కు ప్రయాణం సులువు కానుంది. కేవలం నగరంలోని పశ్చిమ ప్రాంతంలోనే రోడ్ల అభివృద్ధి ఎక్కువగా జరుగుతోందన్న అపవాదును తొలగించుకునేందుకుగాను ఈ సారి ఈ రోడ్ల అభివృద్ధిని నగరం నలువైపులా చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ రోడ్లను విస్తరణలో భాగంగా సౌత్‌జోన్‌లో 16 రోడ్లు, ఈస్ట్ జోన్‌లో 10, వెస్ట్ జోన్‌లో 2, నార్త్ జోన్‌లో 4, మొత్తం 100 కిలోమీటర్లున్న 32 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..