Monday, November 25, 2024

Big story | ఎన్‌ఫోర్స్‌ మెంట్​ మరింత ఫోకస్​.. కల్తీ మద్యంపై కట్టుదిట్టంగా నిఘా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కల్తీ మద్యంపై కొరఢా ఝులిపించేందుకు తెలంగాణ ఆబ్కారీ శాఖ సిద్దమయింది. రాష్ట్ర ఖజానాకు రాబడిని మరింత పెంచే లక్ష్యంతో కఠిన చర్యల దిశగా కార్యాచరణ ముమ్మరం చేస్తోంది. ఈ దిశలో నాన్‌ డ్యూడీ పెయిడ్‌ మద్యం ప్రవాహంపై దృష్టిపెట్టిందవి. ఆదాయానికి గండికొడుతున్న ముఠాలపై రంగంలోకి దిగింది. ఇతర రాష్ట్రాలనుంచి తరలుతున్న నాన్‌ డ్యూడీ పెయిడ్‌ మద్యం నియంత్రించేందుకు ప్రత్యేక కార్యారణ రెడీ చేసింది. ఇందుకు పోలీస్‌, ఆబ్కారీ, ప్రభుత్వ రైల్వే పోలీస్‌, రవణా శాఖలను సమన్వయం చేసింది. ఇటీవలే సంయుక్త సమీక్షలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విమాన, రైల్వే, బస్సు మార్గాలపై ప్రత్యేక నిఘాకు నిర్ణయం తీసుకున్నారు.

ఏ మార్గంలో ఎన్‌డీపీ రవాణా అవుతోంది..దిగుమతి ఎక్కడినుంచి జరుగుతోంది…ఎన్ని ముఠాలున్నాయి…ఎక్కడినుంచి తరలిస్తున్నారు వంటి అనేక విషయాలపై నివేదిక రూపొందించారు. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రైవేటు వాహనాలు, ట్రావెల్‌ బస్సులద్వారా ఎన్‌డీపీ లిక్కర్‌ దిగుమతి అవుతున్నట్లుగా గుర్తించిన అధికారులు కట్టడి చర్యలు ప్రారంభించారు. వీటి కట్టడి చర్యల్లో భాగంగా 12 జిల్లాల్లో 19 ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. తనిఖీల్లో ఎన్‌డీపీ, గుడుంబా, గంజాయి, నల్లబెల్లం, ఆల్ఫ్రాజోలం తదితర నిషేదిత వస్తువులను పట్టుకుంటున్నారు. ఈ ఏడాదిలో భారీగా 90కిపైగా కేసులు నమోదు చేశారు.

- Advertisement -

ఆదిలాబాద్‌ జిల్లాలో లక్ష్మీపూర్‌, భోరజ్‌, ఘన్‌పూర్‌, నిర్మల్‌, బైంసా, అసిఫాబాద్‌ జిల్లాలో వాకిండి, గద్వాల జిల్లాలో నందిన్నె, పుల్లూరు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో కృష్ణ, సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్‌, నిజామాబాద్‌ యాంచా, సాలూర, కామారెడ్డి జిల్లాలో సల్బత్‌పూర్‌, నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్‌, వడపర్తి, ఖమ్మం జిల్లాలో బోనకల్‌, ముత్తగూడెం, కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం, ఆశ్వారావుపేట, వికారాబాద్‌ జిల్లాలో రావులపల్లిలలో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా దాడులకోసం పలు బృందాలను రంగంలోకి దింపారు. ఇప్పటికే శాంపిల్స్‌ను పరీక్షించేందుకు కెమికల్‌ ఎగ్జామినర్‌ను సమకూర్చుకోవడంద్వారా సత్వర ఫలితాలకు ఏర్పాట్లు చేశారు.

పక్క రాష్ట్రాలనుంచి…

కర్నాటక, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, హర్యానా, పాండిచ్చేరి, తదితర రాష్ట్రాలనుంచి రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ను ఇతర ప్రీమియం బాటిళ్లలో నింపడం…దేశీయ మద్యంలో నింపి సొమ్ము చేసుకోవడం, ఇతర రాష్ట్రాలనుంచి రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ను తెచ్చి ఇక్కడ కల్తీ చేయడం జరుగుతోందని గుర్తించారు. హర్యానా, గోవా రాష్ట్రాల్లో బీర్‌, మద్యం ధరలు మన రాష్ట్రాలకంటే ఐదు రెట్లు తక్కువ. తాజాగా తెలంగాణలో ఏటా మూడు కోట్ల మద్యం పెట్టెల విక్రయాలు జరుగుతున్నాయి. వీటిలో అనధికరికంగా అక్రమ బీర్‌ విక్రయాలు కూడా జరుగుతున్నాయి.

కిక్కు కరువు…

ప్రధానంగా మద్యం దుకాణాల్లో ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని కొనుగోలుచేసిన మందుబాబులు కిక్కు ఎక్కడంలేదనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇందుకు కల్తీ మద్యమే కారణమని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ అంటోంది. మన రాష్ట్రంకంటే పొరుగు రాష్ట్రాల్లో బీరు, మద్యంపై ధరలు 5రెట్లు తక్కువగా ఉండటం కూడా ఎన్‌డీపీ తరలింపుకు ప్రధాన కారణమని ఆయా వర్గాలు అంటున్నాయి. అయితే మద్యంలో నీరు లేదా ఇతర బ్రాండ్ల మద్యం కలిపితే ఫర్వాలేదని, కానీ మిథనాల్‌ లేదా ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ కలిపితే ప్రాణాలకే ప్రమాదమని ఆబ్కారీ శాఖ హెచ్చరిస్తోంది.

నిఘా ఇక్కడే….

కల్తీ మద్యం, కల్తీ కల్లు ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కల్తీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దృష్టిసారించింది. కల్తీ మద్యం సరఫరా చేసిన వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని తాజాగా నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement