అమరావతి, ఆంధ్రప్రభ : వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గర్భిణుల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టింది. గర్భిణీ స్త్రీలకు అత్యధునిక టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ (టిఫా) స్కానింగ్ సేవల్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ సేవలు ఉచితంగా అందనున్నాయి. టిఫా స్కాన్ నిమిత్తం రూ.1,100 అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్‌కు రూ.250 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సాధారణంగా ఈ టిఫా స్కాన్‌ను తల్లి గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించడానికి ఉపయోగపడుతోంది. తద్వారా ముందగా జాగ్రత్తలు పడే అవకాశం ఉంటుంది. తొలివిడతగా రేడియాలజిస్టులు అందుబాటులో ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో టిఫా స్కానింగ్ సేవల్ని అందుబాటులోకి రానున్నాయి. అనంతరం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ అందుబాటులోకి తెచ్చేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో గర్భిణీల ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు వీలుగా ప్రత్యేకంగా కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు, గర్భిణీలకు ఒక అనుబంధ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టిఫా స్కానింగ్ పరీక్షల్ని గర్భం దాల్చిన 18 నుంచి 22 వారాల గర్భస్థ దశలో నిర్వహిస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో లబ్ధిదారులైన గర్భిణీలకు సమస్యలు ఉంటే వైద్యుల సూచన మేరకు ఒక టిఫా స్కాన్, రెండు అల్ట్రాసోనోగ్రామ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నారు. సమస్యలు లేని గర్భిణీలకు మూడు అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్లు చేస్తారు. టిఫా, అల్ట్రాసోనోగ్రామ్ స్కానింగ్ సేవలకు సంబంధించి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చారు.
మాతా శిశు మరణాల రేటు తక్కువే
దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో మాతా, శిశుమరణాల రేటు తక్కువే. మాతా, శిశుమరణాలలో దేశంలో తల్లుల మరణాల రేటు 45 శాతం ఉంటే రాష్ట్రంలో 35గా ఉంది. దేశంలో శిశుమరణాల రేటు- 35శాతం అయితే ఏపీలో 30 శాతంగా ఉంది. గర్భిణిలు, పాలిచ్చే తల్లులు, బీపీ, షుగర్, క్యాన్సర్ తదితర బాధితులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తూ వైద్య, ఆరోగ్యరంగ సంస్కరణల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఆస్పత్రుల్లో అత్యవసర కేసులతో పాటు- గర్భిణిలు, బాలింతలు, నవజాత శిశువులకు చికిత్స అందించే విధానంలో కీలక మార్పు దిశగా నూరా హెల్త్ కేర్ క్యాంపెయిన్ శిక్షణా కార్యక్రమాన్ని ఇటీవలే నిర్వహించారు. గర్భిణిలు, బాలింతల విషయంలో వారి తల్లులు, భర్తలు, ఇతర కుటుంబసభ్యులు కూడా తగిత జాగ్రత్తలు తీసుకోనే విధంగా వారిలో అవగాహన కల్పిస్తున్నారు.
ఇందులో భాగంగా 10 వేల మందికిపైగా హెల్త్ అసిస్టెంట్లకి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మైటర్నిటీ వార్డులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా టీ-వీ స్కీన్స్ర్ ఏర్పాటు చేసి పాటించాల్సిన నియమాలు, తీసుకోవల్సిన జాగ్రత్తలను తెలియజేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.. సేవ్ లైఫ్ ఫౌండేషన్ స్టడీ చేసిన అంశాలను ప్రామాణికంగా చేసుకుని అత్యవసర కేసుల్లో క్షేత్ర స్థాయి వైద్య సిబ్బందిలో అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. గర్భిణీకి అందించాల్సిన పౌష్టికాహారం, దీర్ఘ కాలిక రోగాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాథమిక చికిత్సతో పాటు- తదితర అంశాలపై కూడా స్టాఫ్ నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.