అంతరిక్ష రంగంలో పునర్వైభవాన్ని పొందాలన్న లక్ష్యంతో రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్ విఫలైమంది. కక్ష్య మార్పు సమయంలో అదుపుకోల్పోయిన ల్యాండర్ చంద్రుడిపై కుప్ప కూలింది. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన రష్యా శాస్త్రవేత్త మిఖేయిల్ మారోవ్ (90) తీవ్ర అవస్వస్థతకు లోనయ్యారు. లూనా-25 కూలిపోయిన కొద్ది సేపటికే షాక్ తిన్న ఆయన తానున్న చోటే కూలబడిపోయారు. దీంతో, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. లూనా-25 ప్రయోగంలో మిఖెయిల్ కీలక పాత్ర పోషించారు.
ఓ రష్యా వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మిఖెయిల్ మాట్లాడుతూ లూనా-25 వైఫల్యం పెద్ద ఎదురుదెబ్బ అని అభివర్ణించారు. ఈ వైఫల్యం తన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించిందన్నారు. ‘‘ఇలాంటిది జరిగినప్పుడు ఆందోళన చెందకుండా ఎలా ఉండగలం, ఇది నా జీవితానికి సంబంధించిన అంశం.. చాలా క్లిష్టమైన సమయం. ప్రస్తుతం నేను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను’’ అని రష్యా రాజధానిలోని ఓ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు. గతంలో రష్యాకు చెందిన అనేక అంతరిక్ష ప్రయోగాల్లో మిఖెయిల్ పాల్గొన్నారు. ఆయన జీవితకాల కృషికి రూపమే లూనా-25 మిషన్ అని చెప్పుకోవచ్చు.